కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులను ఆయా పాఠశాలల్లోనే కొనసాగించాలని, ఫీజు చెల్లించలేదని ఏ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం విద్యార్థులను తొలగించరాదని పాఠశాల విద్య సంచాలకుడు చినవీరభద్రుడు ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వ బడుల్లో చదువుతున్న వారికి విద్యాకానుక కిట్లను మొదటి ప్రాధాన్యంగా అందించాలని, ప్రైవేటు బడుల్లోని పిల్లలకు అవసరమైన ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలకయ్యే ఖర్చులన్నీ పాఠశాల విద్యాశాఖ చెల్లిస్తుందని తెలిపారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మహిళా, శిశు సంక్షేమ శాఖ సేకరించిన వివరాల ప్రకారం రాష్ట్రంలో 6,800 మంది విద్యార్థులు తల్లిదండ్రులు ఇద్దరినీ లేదా ఎవరో ఒకరిని కోల్పోయారని వెల్లడించారు. వీరిలో 4,333 మంది సమాచారాన్ని పాఠశాల విద్యాశాఖ సేకరించిందని.. 1,659 మంది ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతుండగా 2,150 మంది ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుతున్నారని చెప్పారు.
మిగతా 524 మందిని శిశువులుగా గుర్తించామని తెలిపారు. తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన పిల్లల విషయంలో ఎలాంటి సమస్యలున్నా మండల, డివిజనల్ విద్యాధికారులకు సమాచారమివ్వాలని సూచించారు.
ఎల్పీసెట్ సెప్టెంబరు 25న
భాషా పండిత ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఎల్పీసెట్) సెప్టెంబరు 25న నిర్వహించనున్నారు.. ఈనెల 18 నుంచి సెప్టెంబరు 16వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రవేశ పరీక్షను ఆన్‌లైన్‌లో చేపడతారు.. పూర్తి వివరాలను ఈనెల 16న వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: