Substandard Fertilizers : పంటలను ఆశించిన తెగుళ్లను నాశనం చేస్తాయంటూ హోరెత్తే ప్రచారంతో మార్కెట్‌లో విచ్చలవిడిగా అమ్ముతున్న జీవన పురుగు మందులు(బయో ఫెస్టిసైడ్స్), జీవన ఎరువుల్లో (బయో ఫెర్టిలైజర్స్) నాణ్యత కొరవడింది. వీటి నాణ్యతను పరీక్షించేందుకు రాష్ట్ర వ్యవసాయశాఖకు కనీసం ఒక ప్రయోగశాల కూడా లేకపోవడంతో రైతులకు నాసిరకం మందులను అంటగట్టి దోచేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 3,300 కంపెనీల పేర్లతో పలు రకాల జీవన పురుగు మందులు, జీవన ఎరువులను పలు రకాల బ్రాండ్లతో అమ్ముతున్నారు. వీటిలో చాలాచోట్ల తయారీ ప్లాంట్లు, పరిశోధన కేంద్రం, ఇతర మౌలిక సదుపాయాలు కూడా లేవని వ్యవసాయాధికారులే చెబుతున్నారు. పలుచోట్ల చిన్న ఇళ్లు, రేకులషెడ్లకే ‘బయోపెస్టిసైడ్స్ లేదా ప్లాంట్ ప్రొటెక్షన్’ అంటూ రకరకాల పేర్లతో కంపెనీ బోర్డులు పెట్టి అవే చిరునామాలను వ్యవసాయశాఖకు ఇస్తున్నారు. ఇప్పటివరకూ 355 కంపెనీలు మాత్రమే రిజిస్ట్రేషన్(నమోదు)కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశాయి. గత మూడేళ్లలో ఎన్ని మందులు అమ్మారు. ఏయే ‘ఉత్పత్తి’(ప్రొడక్ట్) ఎంత తయారుచేశారు, ఎక్కడ అమ్మారన్నది ఇవ్వాలి. ఇవన్నీ పక్కాగా ఉంటే వాటికి జీఎస్టీ చెల్లించి ఉండాలి. పలు కంపెనీలు జీఎస్టీ ఎగ్గొడుతున్నందున ఆయా కంపెనీలు సవ్యంగా లేవన్న విషయం అర్థమవుతోంది.
దీంతో ప్రభుత్వానికి రూ.కోట్ల నష్టం వాటిల్లుతోంది. ఇలాంటి కంపెనీలు తయారుచేసే ఉత్పత్తులు వాడి రైతులూ తీవ్రంగా నష్టపోతున్నారు. ఉత్పత్తుల తయారీ వివరాలన్నీ లేక కొన్ని కంపెనీలు రిజిస్ట్రేషన్ చేసేందుకు ముందుకు రావడం లేదని విశ్వసనీయంగా తెలిసింది. వాటికి కనీసం పరిశోధన, తయారీ ప్లాంట్లు కూడా లేకపోవడమే ఇందుకు కారణం.
మరో రెండేళ్లు అమ్ముకుందామనేనా...
ఇంతకాలం జీవన పురుగుమందులు, జీవన ఎరువులు అమ్మే వ్యాపారులు, కంపెనీలపై నియంత్రణకు చట్టం లేదు. తొలిసారి ఈ కంపెనీలు అమ్మే ఉత్పత్తుల వివరాలన్నీ ఇచ్చి రాష్ట్ర వ్యవసాయశాఖ నుంచి ‘ఫారం జీ2’ పొందాలని కేంద్రం ఇటీవల జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో ఆదేశించింది. ఈ ఫారం పొందిన కంపెనీలు మరో రెండేళ్లపాటు తమ ఉత్పత్తులను మార్కెట్‌లో అమ్ముకోవచ్చు. ఈలోగా ఉత్పత్తులలోని జీవన పదార్థాల వివరాలన్నీ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి తెలపాలి. వర్సిటీ వాటిని పరీక్షించి శాస్త్రీయంగా ఉన్నాయని ఆమోదించాల్సి ఉంటుంది.
వర్సిటీ ధ్రువీకరణతో ప్రతి కంపెనీ ‘కేంద్ర పురుగు మందుల నియంత్రణ మండలి’(సీఐబీ) నుంచి శాశ్వత అనుమతి పొందాలి. రాష్ట్ర వ్యవసాయశాఖ ఫారం జీ2 జారీ చేసేముందు వచ్చిన 355 దరఖాస్తులలోని చిరునామాలకు వెళ్లి తయారీ ప్లాంట్లు, పరిశోధన కేంద్రాలు ఏర్పాటుచేశారా అనేది లోతుగా తనిఖీ చేస్తే విషయం బయటపడనుంది. తనిఖీలు జరగకుండా ఒక్కో దరఖాస్తుకు కొంత ముట్టజెపితే చాలని కొందరు సిబ్బంది బేరమాడుతున్నారని నిబంధనల ప్రకారం ఉత్పత్తులు తయారు చేస్తున్న ఒక సంస్థ యజమాని ‘ఈనాడు’కు చెప్పారు. పూర్తిస్థాయిలో తనిఖీలుచేశాకే ఫారం జీ2 జారీ చేయాలని పక్కాగా కంపెనీలు ఏర్పాటుచేసిన వారు వ్యవసాయ కమిషనర్ రఘునందన్‌రావుకు విన్నవించారు. నాసిరకం ఉత్పత్తుల తయారీ ని ‘ఈనాడు’ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా అన్ని పరిశీలించాకే అనుమతి ఇస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి : mirchi farmer:మిర్చి రైతుకు కంప్యూటర్ మిత్రుడు