National Flag జాతీయ జెండా అంటే దేశపు గౌరవం. విను వీధుల్లో దేశ ఖ్యాతిని రెపరెపలాడించే కీర్తి పతాక. అలాంటి జాతీయ జెండాను ఎగరేయాలన్నా.. అవనతం చేయాలన్నా.. అనేక నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఆ నియమాలు పాటించకపోవడం అంటే.. జాతీయ పతాకాన్ని అవమానించడమే. అవమానించడమంటే శిక్షార్హమే. ఇదే.. ఇప్పుడు ప్రజల్లో ఆందోళనకు కారణమైంది. తెలంగాణలోని జీహెచ్‌ఎంసీ అధికారులు నగరవ్యాప్తంగా 2 0లక్షల జాతీయ జెండాలను పంపిణీ చేశారు. పౌరులు సైతం పెద్దఎత్తున జాతీయ పతాకాలను వ్యక్తిగతంగా కొనుగోలు చేసి స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఇళ్లపై ఎగరేసి సంబరాలు చేసుకున్నారు. మరి, ఇప్పుడు పంద్రాగస్టు ముగిసింది. దీంతో.. ఎగరేసిన జెండాలను ఏం చేయాలన్నది పాలుపోకుండా ఉంది. నిబంధనల ప్రకారం వాటిని కనిపించకుండా చేయడం సవాలుగా మారింది. దిల్లీ, ముంబయి వంటి నగరాల్లో స్థానిక మున్సిపాలిటీలు ఉపయోగించిన జెండాలను సేకరించేందుకు స్వచ్ఛంద సంస్థలను, కాలనీ సంక్షేమ సంఘాలను, ఇతర సంస్థలను జోనల్ కంట్రోల్ రూముల్లో అందజేయాలని స్పష్టం చేశారు. ముంబయి నగర పాలక సంస్థ సైతం కాలనీ సంక్షేమ సంఘాలను, స్వచ్ఛంద సంస్థలను, పారిశుద్ధ్య విభాగానికి జెండాల సేకరణ బాధ్యత అప్పగించింది. సామాజిక మాధ్యమాల ద్వారా దిల్లీ, ముంబయి నగరపాలక సంస్థలు ప్రచారం ప్రారంభించాయి.
జీహెచ్‌ఎంసీ స్పందించాలంటూ.. ఇంటిపై ఎగరేసిన జెండాను ఎప్పుడు దించాలి? ఎలాంటి నిబంధనలు పాటించాలి? అనే విషయమై నగరవాసులకు సూచనలు ఏవీ అందలేదు. జీహెచ్‌ఎంసీ ఈ విషయంలో మౌనం ప్రదర్శిస్తోంది.
నియమావళి ఏం చెబుతోంది..? జాతీయ పతాక నియమావళిలో జులై 20, 2022న కేంద్ర సర్కారు పలు సవరణలు చేసింది. వాటి ప్రకారం పగలు, రాత్రి తేడా లేకుండా ఎన్ని రోజులైనా జాతీయ పతాకాన్ని పౌరులు ఎగురవేయొచ్ఛు. గౌరవభావంతో, జెండాకు ఎలాంటి అవమానం కలగకుండా, చిరిగిన స్థితిలో జెండాను ఎగరవేయకుండా, ఇతరత్రా నియమాలను అనుసరించడం మాత్రం తప్పనిసరి. జెండాను అవమానిస్తే మొదటి తప్పునకు మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా ఉంటాయి. అలాగే.. ఎగరేసిన జెండాను ఎలా దించాలి? దించాక ఏం చేయాలి? ఇంట్లో భద్రపరచలేని పరిస్థితిలో పౌరుడు ఆ జెండాను ఎలా విసర్జనం చేయాలి? అనే నిబంధనలు సైతం నియమావళిలో ఉన్నాయి. జాతీయ పతాకాన్ని ధ్వజ స్తంభం నుంచి దించాక.. పద్ధతి ప్రకారం తప్పనిసరిగా మడతపెట్టాలి. ఇలా మడత పెట్టిన జెండాను ఇంట్లో గౌరవంగా భద్రపరచవచ్ఛు. లేదా గోప్యంగా భూమిలో పాతి పెట్టడం, నిప్పులో కాల్చడం ద్వారా విసర్జనం చేయొచ్చు.
భూమిలో పాతి పెడుతున్నారా?.. ముందుగా మడతపెట్టి జెండాలను చెక్క పెట్టెలో దాచాలి. చెక్క పెట్టెను గోప్యంగా, శుభ్రంగా ఉన్న నేలపై తీసిన గుంతలో పాతి పెట్టవచ్చు.
నిప్పు పెడుతున్నారా?.. పరిశుభ్రంగా ఉన్న నేలపై ముందుగా నిప్పు రాజేయాలి. మంటల మధ్యలో మడతపెట్టిన జెండాలను వేయాలి. మడతపెట్టకుండా మంటల్లో వేయడం, భూమిలో పాతిపెట్టడం నేరమవుతుంది. విసర్జనం పూర్తయ్యాక అక్కడున్న వారు కాసేపు మౌనం పాటించి త్రివర్ణ పతాకానికి గౌరవం చాటాలి.
ఇవీ చదవండి: