మావోయిస్టు పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే మృతిని ఆ పార్టీ కేంద్ర నాయకత్వం ధ్రువీకరించింది. ఆయన మృతి చెందినట్టు పార్టీ కేంద్ర కమిటీ శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికారిక ప్రతినిధి అభయ్ పేరుతో ఓ ప్రకటన విడుదలైంది. నిన్న ఉదయం 6గంటలకు ఆర్కే కన్నుమూసినట్టు వెల్లడించారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆర్కే.. డయాలసిస్ జరుగుతుండగా ప్రాణాలు విడిచారని పేర్కొన్నారు.
‘‘ఆర్కే మృతి మా పార్టీకి తీరని లోటు. 1978లో ఆయన పీపుల్స్ వార్ సభ్యత్వం తీసుకున్నారు. 1982 నుంచి పూర్తికాలం కార్యకర్తగా వచ్చారు. 1986లో గుంటూరు జిల్లా కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1992లో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా.. 2000లో ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శిగా.. 2001లో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2004లో ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో కీలక పాత్ర పోషించారు. చర్చల తర్వాత ఆర్కే హత్యకు ప్రయత్నాలు జరిగాయి. 2004 నుంచి పదేళ్ల పాటు ఏవోబీ కార్యదర్శిగా కొనసాగారు. అలాగే, 2018లో కేంద్ర కమిటీ పొలిట్‌బ్యూరోలో ఆర్కేకు స్థానం లభించింది. 2018లో ఆర్కే కుమారుడు మున్నా మృతి చెందారు ’’ అని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటనలో పేర్కొంది.
ప్రజల కోసమే అమరుడయ్యాడు..:కల్యాణరావు
ఆర్కే మరణంపై విరసం నేత కల్యాణరావు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. పార్టీ అధికారిక ప్రకటనతో ఆయన బోరున విలపించారు. ‘‘ఆర్కే ప్రజల హృదయాల్లో ఉంటారు. ఆయన ప్రజల కోసం అమరుడయ్యారు. పోలీసులు వైద్యం అందకుండా చేశారు. వైద్యంఅందకుండా పోలీసులను మోహరించారు. ఆర్కే విప్లవకారుడిగా జీవించారు.. విప్లవకారుడిగానే మరణించారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తాం’’ అన్నారు.
ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్న ఆర్కే.. ఆంధ్ర ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ఇన్‌ఛార్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. 38 ఏళ్ల క్రితం ఉద్యమంలోకి వెళ్లిన ఆర్కే 2004లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరిపిన చర్చలకు ఆంధ్ర రాష్ట్ర కమిటీ ప్రతినిధిగా హాజరయ్యారు. 2004 అక్టోబరు 15, 16, 17 తేదీల్లో చర్చలు జరిగాయి. ఆ ఘట్టం మొదలై శుక్రవారానికి సరిగ్గా 17 ఏళ్లు. సాకేత్, శ్రీనివాసరావు, ఎస్వీ, సంతోష్, గోపాల్, పంతులు ఆయన మారుపేర్లు.
చర్చల ప్రతినిధి
మావోయిస్టు ఉద్యమంలో అత్యంత కీలకమైన శాంతి చర్చల ప్రస్తావన రాగానే ఆర్కే గుర్తొస్తారు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీపుల్స్‌వార్‌కు మూడు రాష్ట్ర కమిటీలు ఉండేవి. ఉత్తర తెలంగాణ నుంచి గాజర్ల రవి అలియాస్ గణేశ్, ఏవోబీ తరఫున సుధాకర్, ఆంధ్ర రాష్ట్ర కమిటీ వైపున రామకృష్ణ, జనశక్తి తరఫున రియాజ్ హాజరయ్యారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థలో మూడు రోజులపాటు చర్చలు జరిగాయి.
పెద్దసంఖ్యలో కేసులు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో ఆర్కేపై పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయి. ఇందులో ప్రధానమైంది చంద్రబాబునాయుడిపై అలిపిరిలో జరిగిన ఘటన. బలిమెలలో గ్రేహౌండ్స్ బలగాలపై జరిగిన దాడిలోనూ ఆర్కే నిందితుడు. ఆయనపై ఒడిశా రూ.20 లక్షలు, ఛత్తీస్‌గఢ్ రూ.40 లక్షలు, ఝార్ఖండ్ రూ.12 లక్షలు, తెలంగాణ ప్రభుత్వం రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది.
ఇదీ చదవండి: