ఈ ఏడాది కృష్ణా, గోదావరి నదులకు పెద్ద ఎత్తున వరదలు రావడంతో ప్రజలు అనేక కష్టనష్టాలు ఎదుర్కొన్నారు. గోదావరి వరదకు ఉభయగోదావరి జిల్లాలు, ఎగువన పోలవరం ముంపు గ్రామాలు విలవిల్లాడాయి. కృష్ణావరదలకు ప్రకాశం బ్యారేజి దిగువన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అనేక లంకగ్రామాలు నీట మునిగాయని, పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని అధికారులు ప్రకటించారు. కృష్ణా జిల్లాలో బ్యారేజి దిగువన 32 మండలాలకు 31 గ్రామాలు ముంపులో చిక్కుకున్నాయి. 14,414 హెక్టార్లలో వరి, 4,568 హెక్టార్లలో ఉద్యానపంటలు దెబ్బతిన్నాయి. గుంటూరు జిల్లాలో 20 లంకగ్రామాలు నీట మునిగాయి. 10వేల హెక్టార్లకు పైగా వ్యవసాయ, ఉద్యాన పంటలు మునిగి ఉంటాయని లెక్కిస్తున్నారు. ప్రకాశం బ్యారేజికి మళ్లీ పెద్దఎత్తున వరద రాబోతోందని కలెక్టర్ ప్రకటించారు. ఏ సమయానికైనా 9 లక్షల క్యూసెక్కుల వరద తాకనున్నట్లు తెలిపారు.
ముందే హెచ్చరికలున్నా..
సాధారణంగా అక్టోబరులో జలాశయాలు ఖాళీ చేసుకోవడానికి అధికారులు కాస్త సందేహిస్తారు. ఆ తర్వాత వర్షాలుండవు, ఆనక తాగునీటిని అందించడానికి నీటిని నిల్వ చేసుకుని ఉంచుకోవాలి. కానీ అన్ని జలాశయాలు నిండిపోయి ఎగువన కర్ణాటక, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు భారీవర్ష సూచనను ముందే వాతావరణశాఖ అందించింది. ముందే పులిచింతలను ఖాళీచేస్తే ప్రకాశం బ్యారేజి దిగువన ఇంత వరద ముంపు ఏర్పడేది కాదని విశ్రాంత ఇంజినీర్లు విశ్లేషిస్తున్నారు. తెలంగాణలో ‘క్లౌడ్‌బరస్టు’ అవుతుందని వాతావరణశాఖ ముందే హెచ్చరించింది. శ్రీశైలం ఎగువన జలాశయాలన్నింటిలో పెరుగుదలపై కేంద్ర జలసంఘం ముందే చెబుతూ వచ్చింది. తెలంగాణలో కురిసే వర్షాలన్నీ కృష్ణాబేసిన్లో అని.. ఆ నీరంతా మూసీ నుంచి పులిచింతల, కట్టలేరు, మునేరు, పాలేరుల మీదుగా ఆంధ్రప్రదేశ్‌కు చేరుతుందని అంచనా వేయడంలో ఏపీ జలవనరులశాఖ విఫలమైందని ఆ శాఖలో అనుభవజ్ఞులే విమర్శిస్తున్నారు.
శ్రీశైలంపైనా నిర్లక్ష్యం
కిందటేడాది, ఈ ఏడాది కూడా శ్రీశైలం జలాశయం నిర్వహణ విషయంలో మార్గదర్శకాలు పాటించలేదు. గేట్ల నిర్వహణ సరిలేక క్రస్టుగేట్ల పైనుంచి నీరు పొంగిపొర్లిన సందర్భాలు అనేకం. పైగా శ్రీశైలం జలాశయం వద్ద ఇంజినీర్లు చాలామంది నివాసం ఉండకపోవడం వల్ల పర్యవేక్షణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
మరోవైపు ఎక్కడ అనుభవం ఉన్న అధికారులను అక్కడ వినియోగించుకోపోవడం వల్ల కూడా సమస్యలు తలెత్తుతున్నాయి. గోదావరిలో మొన్నటి వరదల్లో ఇబ్బందులు తలెత్తడంతో నెల్లూరు నుంచి ఎస్‌ఈని ధవళేశ్వరానికి తీసుకొచ్చి వరదను పర్యవేక్షించాల్సి వచ్చింది.
వరద నియంత్రణ కమిటీ ఏదీ?
ప్రస్తుత పరిస్థితుల్లో వరద నియంత్రణ చర్యలపై విశ్రాంత సీనియర్ ఇంజినీర్లు విమర్శిస్తున్నారు. స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక, సమన్వయం, ఉన్నతస్థాయి పర్యవేక్షణ కొరవడ్డాయని విశ్లేషిస్తున్నారు. మూడు నాలుగేళ్ల కిందటి వరకు ఏటా వరద నియంత్రణ కమిటీ ఏర్పాటు చేసేవారని, ఇప్పుడు అలాంటి ప్రయత్నమే లేదని చెబుతున్నారు. కేంద్ర జలసంఘం, వాతావరణశాఖ, అప్సరాక్, ఇస్రో వంటి సంస్థల సాయంతో అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్లేషించి ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ- వాతావరణాన్ని అంచనా వేసుకుంటూ నిర్ణయాలు తీసుకుంటే దిగువకు ఇంత వరద ఒకేసారి వచ్చి ముంపు ఉండేది కాదని చెబుతున్నారు. గతంలో రాష్ట్రస్థాయిలో వరద కంట్రోల్‌రూం ఏర్పాటుచేసేవారు. రోజూ ఒక సీఈ దీనికి ఇన్‌ఛార్జిగా ఉండేవారు. ఎస్‌ఈ, ఈఈ స్థాయి అధికారులు 24 గంటలు షిప్టు పద్ధతిలో డ్యూటీలు చేసేవారు. వరద మార్గాన్ని పరిశీలిస్తూ ఎప్పటికి ఎక్కడికి ఎంత వరద చేరుతుందనే లెక్కలు వేసేవారు. ప్రతి 3గంటలకు సమాచారం సీఎం కార్యాలయానికి పంపేవారు.
ఇదీ చదవండి:
ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద..లోతట్టు ప్రాంతాలు అప్రమత్తం