గోదావరి వద్ద జల ప్రవాహం పెరగడంతో కృష్ణా డెల్టాకు సాగు నీటి విడుదలకు.. నీటిపారుదల శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం గోదావరి వద్ద 25వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంది. సాధారణంగా 10వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం దాటితేనే పంపులు పని చేసే అవకాశం ఉంటుంది. గురువారం నీటి విడుదలకు అధికారులు సమయాత్తమయ్యారు. కృష్ణా డెల్టా నీటిపారుదల శాఖ అధికారుల సూచన మేరకు ఎన్ని పంపులు విడుదల చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. కనీసం 8,500 క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది.
మూడు రోజుల్లో పవిత్ర సంగమం..!
గోదావరి జలాలు ప్రకాశం బ్యారేజీలోకి చేరేందుకు కనీసం మూడు రోజులు పడుతుంది. పట్టిసీమ నుంచి పవిత్ర సంగమం వరకు దాదాపు 180 కి.మీ దూరం ఉంది. ఈ దూరం నీటి ప్రవాహానికి మూడు రోజుల సమయం పడుతుంది. గురువారం విడుదల చేస్తే శనివారం రాత్రికి చేరుకొనే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గోదావరి కృష్ణా నదుల అనుసంధానంలో భాగంగా పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం చేసిన విషయం తెలిసిందే. పట్టిసీమ వద్ద మొత్తం 24 పంపులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వీటిలో 21 పంపులు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో పది పంపుల ద్వారా నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. కనీసం 8,500 క్యూసెక్కుల నీరు విడుదల చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీలో 11.1అడుగుల నీరు మాత్రమే ఉంది. మూడు రోజుల్లో పట్టిసీమ నీరు ప్రకాశం బ్యారేజీకి చేరితే తొలుత ఈ నెల 20 కాలువలకు సాగునీరు విడుదల చేయాలని భావిస్తున్నారు. తాగునీటి అవసరాలతో పాటు చెరవులు నింపితే.. రైతులు నార్లు పొసుకునేందుకు అవకాశం ఉంటుంది. గత ఏడాది పట్టిసీమ ద్వారా జూన్ 26న నీరు విడుదల చేశారు. నాడు కేవలం మూడు పంపులు మాత్రమే విడుదల చేశారు.
గత ఏడాది కృష్ణా నదికి వరదలు పోటెత్తాయి. దీంతో చాలా తక్కువ మొత్తంలో గోదావరి జలాలను తీసుకున్నారు. కృష్ణా డెల్టా కింద నాలుగు జిల్లాల్లో 13.08లక్షల ఎకరాలు ఆయకట్టు ఉంది. అనధికారికంగా మరో 1.5లక్షల ఎకరాలు సాగు చేస్తున్నారు. ఖరీఫ్‌లో ప్రధానంగా వరిసాగు చేస్తున్నారు. 2018 ఖరీఫ్ సీజన్ నుంచి జులై నెలల్లోనే నాట్లు వేస్తున్నారు. గత ఏడాది నార్లు పోసేందుకు మందుగానే నీటిని విడుదల చేశారు. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా ప్రతి ఏడాది 80 టీఎంసీలు తీసుకోవాలనేది లక్ష్యం. కాలువల ద్వారా 8,500 క్యూసెక్కుల నీరు విడుదల చేసేవారు. గత ఏడాది గోదావరి జలాలు పట్టిసీమ ద్వారా 28 టీఎంసీలు మాత్రమే వచ్చాయి.
ఈ ఏడాది కృష్ణా వరద జలాలను పోతిరెడ్డిపాడు కాలువ ద్వారా మళ్లించే ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు తప్పనిసరి అని చెబుతున్నారు. ప్రస్తుతం తాగునీటి అవసరాలకు ఈ నెల20 నీటిని విడుదల చేయాలని భావిస్తున్నారు. ముందస్తుగానే పట్టిసీమ నీరు అందిస్తే నారు మడులు సిద్ధం చేసుకునే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు. గోదావరిలో క్రమేపీ వరద పెరుగుతోంది. ప్రస్తుతం పోలవరం వద్ద 14 మీటర్లు దాటి నీటి ప్రవాహం సాగుతోంది. దీంతో ఎలాంటి సమస్య ఉండదని, కృష్ణాకు వరదలు రాకపోయినా.. పట్టిసీమ నీటిని ప్రకాశం బ్యారేజీ ద్వారా డెల్టాకు అందించే అవకాశం ఉందని చెబుతున్నారు.
ప్రస్తుతం డెల్టా పరిధిలో తాగునీటి అవసరాలను తీర్చాల్సి ఉంది. దీంతో ఈనెల 20న విడుదల చేయాల్సి ఉందని అధికారులు భావిస్తున్నారు. బుధవారం నుంచే పట్టిసీమ పంపులు ప్రారంభించనున్నారు. దీంతో సాగునీటి విడుదలకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మొదటి విడతలో తాగునీటి అవసరాలకు, చెరువులను నింపేందుకు విడుదల చేస్తారు. 10 రోజులపాటు కాలువలకు వదిలి తర్వాత నిలుపుదల చేయనున్నారు. రెండో విడతలో సాగు అవసరాలను దృష్టిలో ఉంచుకొని వరదలు, వర్షాల ఆధారంగా విడుదల చేయనున్నారు. గురువారం పట్టిసీమ ఎత్తిపోతల పథకం పంపులు ప్రారంభిస్తామని అక్కడి అధికారులు ధ్రువీకరించారు.
ఇదీ చదవండి: బండరాళ్లే భారత్-చైనా సరిహద్దు: కర్నల్ చంద్రశేఖర్