రాష్ట్రంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల కార్యాలయాలు ఇకనుంచి సెలవు రోజుల్లోనూ పని చేయనున్నాయి. కొత్త విధానం నేటి నుంచి అమల్లోకి వస్తుందని గుంటూరు జిల్లా రిజిస్ట్రార్ రాంకుమార్ తెలిపారు. కరోనా నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల శాఖకు ఆదాయం పడిపోయింది. ఏప్రిల్, మే నెలల్లో ఎలాంటి లావాదేవీలు జరగలేదు. అనంతరం తెరిచినా కరోనా కట్టడికి సామాజిక దూరం పాటించడం, ఇతరత్రా కారణాల వల్ల ఆశించిన స్థాయిలో ఆదాయం సమకూరలేదు. ఈ నేపథ్యంలో సెలవు రోజుల్లోనూ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు తెరిచి లావాదేవీలు నిర్వహించడం వల్ల ఆదాయం సమకూరుతుందని ఉన్నతాధికారులు భావించారు. ఈ మేరకు రిజిస్ట్రేషన్ కార్యాలయాలు సెలవు రోజుల్లోనూ పనిచేసేలా నిర్ణయం తీసుకున్నారు.
జాతీయ సెలవు దినాల్లో మాత్రమే కార్యాలయాలు మూసివేస్తారు. గతేడాది ఆదాయంతో పోల్చితే ఇప్పటి వరకు 40 నుంచి 50 శాతం మేర తగ్గుదల కనిపిస్తోంది. ఈ లోటును భర్తీ చేసేందుకు సెలవు రోజుల్లోనూ కార్యాలయాలు పనిచేయనున్నాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి జిల్లా రిజిస్ట్రార్, డీఐజీ కార్యాలయం వరకు మొత్తం 35 కార్యాలయాలు పని చేయనున్నాయి. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ విధానం అమలులో ఉండనుంది.
ఇదీ చదవండి