కరోనా పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రాలకు ప్రకటించిన ఆర్థిక వెసులుబాటును మరో ఆరు నెలలు పొడిగించాలని రిజర్వుబ్యాంకు నిర్ణయించింది. వేస్ అండ్ మీన్స్ పరిమితి రూ.2,416 కోట్లు సైతం 6 నెలలు కొనసాగుతుంది. వేస్ అండ్ మీన్స్‌కు సంబంధించి రోజుల పరిమితి, ప్రత్యేక డ్రాయింగు సదుపాయం, ఓవర్‌డ్రాఫ్టు విషయంలో గతంలో సడలించిన పరిమితులూ మరికొన్నాళ్లు ఉంటాయి. కరోనా నేపథ్యంలో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను తాజాగా సమీక్షించిన రిజర్వుబ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది. 2022 మార్చి 31 వరకూ ఈ సదుపాయాలను కల్పిస్తున్నట్లు పేర్కొంది.
రాష్ట్రాల వసూళ్లు, చెల్లింపుల మధ్య సర్దుబాటు ప్రక్రియ మరింత సులభంగా ఉండేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. తొలుత కరోనా నేపథ్యంలో 2020 ఏప్రిల్‌లో ఈ వెసులుబాటు కల్పించారు. ఆ తర్వాత ఆరు నెలలకోసారి సమీక్షించి గడువు పొడిగిస్తూ వచ్చారు. వచ్చే ఏడాది మార్చిలో మరోసారి సమీక్షిస్తారు. ఒక నెలలో ఓవర్ డ్రాఫ్టు వెసులుబాటును ప్రతీ రాష్ట్రం 14 రోజులు వినియోగించుకునే ఆస్కారం ఉండేది. దాన్ని 21 రోజులకు పెంచారు. ప్రతి మూడు నెలల్లో ఓవర్ డ్రాఫ్టులో ఉండే కాలపరిమితి గతంలోనే 50 రోజులకు పెంచారు. మరో ఆరు నెలల పాటు ఇవన్నీ కొనసాగుతాయి.
ఏమిటీ వెసులుబాటు?
రాష్ట్ర ప్రభుత్వాలకు రిజర్వుబ్యాంకు ఒక బ్యాంకులా వ్యవహరిస్తుంది. రాష్ట్రాల వసూళ్లకు, చెల్లింపులకు మధ్య వ్యత్యాసం వచ్చి ఎక్కువ మొత్తాలు చెల్లించాల్సి వచ్చినప్పుడు ఈ వేస్ అండ్ మీన్స్ రూపంలో ఆదుకుంటుంది. ఇది రెండు రూపాల్లో ఉంటుంది. ప్రత్యేక డ్రాయింగ్ సదుపాయం, వేస్ అండ్ మీన్స్ ముందస్తు వినియోగం. ఈ రెండు వెసులుబాట్లు పూర్తయ్యాక ఓవర్ డ్రాఫ్టునకు వెళ్తారు. అంటే రాష్ట్రానికి ఆదాయం లేకపోయినా తాత్కాలికంగా రిజర్వుబ్యాంకు సర్దుబాటు చేసి తిరిగి వసూలు చేసుకునే ఒక విధానం. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి విడివిడిగా పరిమితులు ఉంటాయి. ప్రత్యేక డ్రాయింగ్ సదుపాయం ఎంతనేది రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీలు, ఇతర డిపాజిట్ల ఆధారంగా లెక్కించి అవకాశం కల్పిస్తారు.
రాష్ట్రం ఎలా వినియోగించుకుంటుంది?
ప్రతి రాష్ట్రం రిజర్వు బ్యాంకులో కనీస నిల్వలు ఉంచాలి. ఆ పరిధిలోనే చెల్లింపులు జరపాలి. ఒకవేళ ప్రభుత్వ ఆదాయం లేకపోతే తొలుత ప్రత్యేక డ్రాయింగ్ సదుపాయం కింద ఉన్న మొత్తం వెసులుబాటును వినియోగించుకుంటుంది. ఉదాహరణకు ఎస్‌డీఎఫ్ కింద రూ.600 కోట్ల పరిమితి ఉంటే రాష్ట్రానికి ఆదాయం లేకపోయినా ఆ మేరకు చెల్లింపులకు ఇబ్బంది ఉండదు. ఆ నిధి వాడిన తర్వాత వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సుకు వెళ్లవచ్చు. ఆ పరిమితి రూ.2,416 కోట్లుగా రిజర్వుబ్యాంకు పేర్కొంది. ప్రస్తుతం ఎస్‌డీఎఫ్ సదుపాయం వినియోగించుకున్న తర్వాత ఇంకా ఆదాయం లేకపోతే రూ.2,416 కోట్ల వరకు చెల్లింపులు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఓడీ సౌకర్యం వినియోగిస్తారు. ఈ సమయంలో నిబంధనలకు లోబడి కొంత వడ్డీ వసూలుచేస్తారు.
ఇదీ చూడండి: ఓటు హక్కు వినియోగించుకున్న చిరు, బాలకృష్ణ