రాయలసీమ ప్రాంతానికి గోదావరి జలాలు తీసుకుపొమ్మని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం అభినందనీయమని రాయలసీమ ప్రాంత నేతలు పేర్కొన్నారు. ఈ ప్రకటనపై సీఎం జగన్ చొరవ తీసుకొని గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేస్తూ చట్టబద్ధత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మైసూరారెడ్డి, గంగుల ప్రతాప్‌రెడ్డి, మాజీ డీజీపీలు దినేశ్‌రెడ్డి, ఆంజనేయరెడ్డి సహా 16 మంది నేతలు, మాజీ అధికారులు.... అనేక అంశాలను ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమలులోకి రాని పరిస్థితుల్లో ఏపీ ముందున్న ప్రత్యామ్నాయం గోదావరి జలాలు మళ్లించడమేనన్నారు. ఆదా అయిన నీటిని గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించి చట్టబద్ధత కల్పించటం తప్ప మరో దారి లేదని అభిప్రాయపడ్డారు.
పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాకి గోదావరి జలాలను గత 2 ఏళ్లుగా తరలిస్తున్నందున.... కృష్ణా జలాలు ఆదా అయిన మాట వాస్తవమేనని సీమ నేతలు పేర్కొన్నారు. ఆదా అయిన కృష్ణా నీటిని గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయిస్తూ చట్టబద్ధత కల్పించమని శాసనసభలోగత ప్రభుత్వాన్ని ప్రతిపక్ష హోదాలో జగన్ డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆదా అయిన కృష్ణా నీటితో గ్రేటర్ రాయలసీమ వాసుల దాహార్తి తీర్చవచ్చన్న నేతలు... హంద్రీనీవా, గాలేరు, నగరి, శ్రీశైలం కుడి కాలువ, తెలుగుగంగ జలాశయాలు నింపవచ్చని లేఖలో పేర్కొన్నారు. పంట కాల్వల పనులు పై ప్రత్యేక దృష్టి పెట్టి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. తర్వాతే పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు గురించి ఆలోచించాలని సీఎంకు సీమ నేతలు సూచించారు.
తెలంగాణలో కాళేశ్వరం అమలులో ఉందన్న రాయలసీమ నేతలు... ఏపీ ప్రభుత్వం గోదావరి జలాలను మళ్లించి నాగార్జున సాగర్ కుడి, ఎడమల కాల్వల ఆయకట్టు స్థిరీకరణకు చింతలపూడి , మహాసంగమ ప్రాజెక్ట్ చేపట్టడమే కాకుండా పట్టిసీమ కింద కృష్ణా డెల్టా ఆయకట్టుకి నీరందించే ప్రయత్నాలు చేస్తున్నట్లు గుర్తుచేశారు. భద్రాచలం కింద ఉన్న గోదావరి జలాలను స్థిరీకరణకు వాడుకొనుటకు రాష్ట్రానికి పూర్తి హక్కు ఉన్నందున... అలాంటి మళ్లింపు పథకాలను జాతీయ పార్టీలు వివాదాస్పదం చేయవన్నారు. అలా ఆదా అయిన కృష్ణా నీటిని రాయలసీమ ప్రాజెక్టులకు తరలించడానికి సిద్దేశ్వరం వద్ద అలుగు ఏర్పాటు చేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదన్నారు. ఖర్చు కూడా తక్కువ అవుతుందన్నారు. ఎత్తిపోతల లేకుండా గ్రావిటీ ద్వారా నీటిని మళ్లించే అవకాశం ఉంటుందన్నారు. ఈ విషయాన్ని తామంతా.. టెలీకాన్ఫెరెన్స్ లో చర్చించుకొని సీఎంకు లేఖ రాసినట్లు సీమ నేతలు తెలిపారు.
ఇదీ చదవండి: