Raja Singh Was Rescued in Amaranth : అమర్‌నాథ్ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా కురిసిన కుండపోత వర్షానికి కొండలపై నుంచి వరద పోటెత్తింది. ఈ వరదలో 13 మంది ప్రాణాలు కోల్పోగా.. 40 మంది దాకా గల్లంతైనట్లు సమాచారం. అమర్‌నాథ్ యాత్రకు తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ తన పరివారంతో కలిసి వెళ్లారు. ఆయన, తన కుటుంబం అంతా క్షేమంగా ఉన్నట్లు రాజాసింగ్ ఓ వీడియో విడుదల చేశారు. వారిని అక్కడి పోలీసులు సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలిపారు.
‘‘ఇటీవల నా కుమార్తె వివాహం జరిగింది. కుమార్తె, అల్లుడితో పాటు 11 మంది కుటుంబ సభ్యులతో ఈనెల 6న అమర్‌నాథ్ యాత్ర కోసం హైదరాబాద్ నుంచి బయలుదేరాం. వాతావరణం అనుకూలించక హెలికాప్టర్ రద్దు కావడంతో దిల్లీ నుంచి అతికష్టం మీద గురువారం సాయంత్రం పంచతరణికి చేరుకున్నాం. రాత్రి అక్కడ ఓ టెంట్‌లో నిద్రించి శుక్రవారం ఉదయం ఆరు గంటలకు గుర్రాలపై అమర్‌నాథ్‌కు చేరుకున్నాం." అని రాజాసింగ్ తెలిపారు.
"మధ్యాహ్నం ఒంటి గంటకు అమర్‌నాథ్‌లో దర్శనం తర్వాత సుమారు అర కిలోమీటరు దూరం నడిచి వచ్చామో లేదో..! ఒక్కసారిగా భయంకరమైన శబ్దంతో కొంత దూరంలో వరద కనిపించింది. భక్తులు పెద్ద సంఖ్యలో ఉండటంతో హాహాకారాలు, ఉరుకులు, పరుగులు మొదలయ్యాయి. మాకు కొంత దూరంలోనే వరద ప్రవాహంలో ఎంతోమంది కొట్టుకుపోతున్న దృశ్యాలు చూసి ప్రాణాలతో బయటపడతామా..? అనే భయం కలిగింది. సమయానికి గుర్రాలు దొరికాయి. క్షణం ఆలోచించకుండా వాటిపై తిరుగు ప్రయాణమయ్యాం. కిందకు దిగేందుకు సుమారు మూడు గంటల సమయం పట్టింది." -- రాజాసింగ్, గోషామహల్ ఎమ్మెల్యే
"నాకు తీవ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందన్న విషయం తెలుసుకొని అక్కడి పోలీసులు ప్రత్యేక ఎస్కార్ట్ వాహనాన్ని సమకూర్చి నన్ను, నా కుటుంబసభ్యుల్ని వెంటనే శ్రీనగర్‌కు తరలించారు. కొన్ని నిమిషాలు ఆలస్యమైతే మా పరిస్థితి మరోలా ఉండేదేమో. అదృష్టవశాత్తు బయటపడ్డాం. శనివారం వైష్ణోదేవీ అమ్మవారి దర్శనానికి వెళ్తాం. ఆదివారం ఒక్క రోజు విశ్రాంతి తీసుకొని సోమవారం తిరిగి హైదరాబాద్‌కు వస్తాం. తెలుగు రాష్ట్రాలకు చెందిన వందలాది మంది భక్తులు అక్కడ మాకు ఎదురయ్యారు. వారందరినీ సురక్షిత ప్రాంతాలకు చేర్చడానికి భద్రతా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టడం కనిపించింది’’ అని రాజాసింగ్ తెలిపారు.
అమర్‌నాథ్ యాత్ర ప్రమాదంపై రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బండి.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో ఉన్న యాత్రికులను కాపాడేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఐటీబీపీ సహా ఇతర సంస్థలు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నాయని వెల్లడించారు.
ఇదీ చదవండి :