తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తుండగా.. కొన్ని చోట్ల వరుణుడి ప్రతాపం చూపిస్తున్నాడు. చాలా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. బయటకెళ్లే పరిస్థితి లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. రోజువారి వ్యాపారులు, అత్యవసర పరిస్థితిలో గడపదాటాల్సినవారు, ద్విచక్రవాహన చోదకులు వర్షం ప్రభావంతో సతమతమవుతున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్‌పై వరుణుడి ప్రతాపం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. జిల్లాలోని ఇంద్రవెల్లి మండలంలో 8.92.సెంమీ వర్షపాతం నమోదైంది. మంచిర్యాల జిల్లా సింగరేణి బొగ్గు ఉత్పత్తిపై వర్షం కొంత వరకు ప్రభావం చూపింది. నిర్మల్ జిల్లా కడెం మండలం గంగాపూర్ వాగుపొంగిపొర్లడంతో దత్తాజీపేటలో పురిటినొప్పులతో బాధపడిన ఎల్లవ్వను కడెం ఆసుపత్రికి తరలిస్తుండగా తీవ్రఇబ్బంది పడాల్సి వచ్చింది. కుమురంభీం జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాలతో వ్యవసాయ పనులు నిలిచిపోయాయి.
పొంగి పొర్లుతున్న వాగులు వంకలు
జిల్లాలోని బోథ్ నియోజకవర్గంలో భారీ వర్షాలకు వాగులు పొంగి రోడ్లను ముంచెత్తాయి. పొచరా, కుంటాల జలపాతం వరద నీటితో ఉప్పొంగి ప్రవహిస్తోంది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కుంటాల జలపాతానికి వెళ్లే దారిలో సవర్గవ్ వాగు ఉద్ధృతితో పర్యాటకులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. సుమారు 16 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
వర్షాలకు జలాశయాలు నిండుకుండలా మారాయి. పెద్దపల్లి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ఎల్లంపల్లి (Ellampalli project) జలాశయానికి, పార్వతీ బ్యారేజ్, కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 87,440 క్యూసెక్కులు ఉండగా.. 16 గేట్లు ఎత్తి 87,440 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ 20 టీఎంసీలు కాగా... ప్రాజెక్టు ప్రస్తుత నీటినిల్వ 19.73 టీఎంసీలుగా ఉంది. కడెం జలాశయానికి (kadem project)వరద ప్రవాహం ( Flood flow ) కొనసాగుతోంది. జలాశయానికి ఏకధాటిగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీనితో అధికారులు 5 గేట్లు తెరిచి దిగువకు నీటిని వదిలారు.
చేపల వేటకు వెల్లి గోదావరిలో వ్యక్తి గల్లంతు
ములుగు జిల్లా వెంకటాపురం మండలం బీసీ మర్రిగూడేనికి చెందిన ముగ్గురు... చేపల వేటకు వెళ్లారు. గోదావరిలో చేపల వేట ముగించుకుని తిరిగి వస్తుండగా.. అకస్మాత్తుగా వరద ఉద్ధృతి పెరగడంతో గగ్గురి రాజు అనే వక్తి కొట్టుకుపోయాడు.
ప్రాజెక్టుల్లో జలకళ
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రెండు రోజులుగా వర్షం కురుస్తోంది. జిల్లా వ్యాప్తంగా 563.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నారు.
ప్రాజెక్టు | గరిష్ఠ నీటిమట్టం మీటర్లలో.. | ప్రస్తుత నీటిమట్టం | ఇన్‌ఫ్లో క్యూసెక్కులు | ఔట్‌ప్లో క్యూసెక్కులు |
కుమురంభీం జలాశయం | 243 | 241.9 | 1,300 | 10,128 |
వట్టి వాగు | 239.500 | 238 | 1,458 | - |
తగ్గిన భక్తుల తాకిడి... వర్షంలోను ఎమ్మెల్యే పర్యటన
భద్రాద్రిలో ఎడతెరిపిలేని వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉదయం నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో భద్రాద్రి రామయ్య సన్నిధిలో భక్తుల రద్దీ తగ్గింది. ముసురు వానలోనూ భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఏజెన్సీలో పర్యటించారు. బురద మయమైన రోడ్లు వాగులు వంకలు దాటి దుమ్ముగూడెం మండలం లో పర్యటించారు. యాదాద్రిలోను భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉదయం నుంచి కురిసిన వర్షంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. తడుస్తూనే స్వామివారిని దర్శించుకున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో..
ఉపరితల ఆవర్తన ప్రభావంతో...ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం సాయంత్రం నుంచి ముసురుపట్టింది. వరంగల్, హన్మకొండ, కాజీపేట, మడికొండ, ధర్మసాగర్ తదితర మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. దీంతో వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. వచ్చే రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో లోతట్టు ప్రాంత వాసులు ఆందోళనకు గురవుతున్నారు. ఇటు వరంగల్ గ్రామీణ జిల్లాలోని పరకాల, నర్శంపేట, వర్ధన్నపేట మండలాల్లోనూ నిరంతరంగా వాన కురుస్తోంది. మహబూబూబాద్, జనగామ, ములుగు, భూపాలపల్లి జిల్లాలోనూ వానలు పడుతున్నాయి.
ఇదీ చూడండి: జోరువానల్లో.. స్వర్గాన్ని తలపిస్తున్న సొరంగాలు