వైకాపా అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న ఆ పార్టీ ఎంపీల జాబితా నుంచి తన పేరును తొలగించడంపై రఘురామకృష్ణరాజు(MP RAGHURAMA) స్పందించారు. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్‌కు లేఖ రాశారు. వైకాపా తరఫున గెలిచిన తన పేరును తొలగించడంపై అందులో ప్రస్తావించారు. వైకాపా నుంచి తనను బహిష్కరించారా..? అని ఎంపీ సందేహం వ్యక్తం చేశారు. పొరపాటున పేరు తొలగించారా..? లేక కావాలనే చేశారా..? అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని జగన్‌ను కోరారు.
కావాలనే తన పేరును వైకాపా వెబ్‌సైట్ నుంచి తొలగించినట్లయితే పార్టీ నుంచి బహిష్కరించినట్లుగా భావిస్తానని.. 48 గంటల్లో పేరు చేర్చకపోతే పార్లమెంట్ సెక్రటేరియట్ దృష్టికి తీసుకెళతానని చెప్పారు. ఈ క్రమంలో తనును తాను స్వతంత్ర అభ్యర్థిగా ప్రకటించుకోవాల్సి వస్తుందని లేఖలో పేర్కొన్నారు.
రాజ్యసభ, లోక్‌సభకు కలిపి వైకాపా తరఫున 28 మంది ఎంపీల పేర్లు గతంలో వెబ్‌సైట్‌లోని జాబితాలో పొందుపరిచారు. తిరుపతి నుంచి ఇటీవలే గెలిచిన గురుమూర్తి పేరును ఎంపీల జాబితాలో చేర్చారు. అయితే రఘురామకృష్ణరాజు పేరు ఇప్పుడు జాబితాలో లేదు. ఈ నేపథ్యంలో ఆయన జగన్‌కు లేఖ రాశారు.
ఇదీ చదవండి: