మాజీ మంత్రి నారాయణ కుమార్తెలు, అల్లుడు, మరికొందరు ముందస్తు బెయిలు కోసం దాఖలు చేసిన వ్యాజ్యాల్లో ఇరువైపులా వాదనలు పూర్తయి ఉత్తర్వులు వెల్లడించే దశలో అదనపు ఏజీ వాదనలు వినిపిస్తారని, సమయం కావాలని అదనపు పీపీ దుశ్యంత్‌రెడ్డి కోరడంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వాదనలు పూర్తి కావడంతో వ్యాజ్యాలపై న్యాయస్థానం ఓ నిర్ణయానికి వచ్చిందని, ఈ దశలో మళ్లీ వాదనలు చెబుతామనడం సరికాదని వ్యాఖ్యానించింది.
అదనపు ఏజీ వాదనలు వినిపించాలని అనుకుంటే ఆ విషయం ముందే కోర్టుకు తెలియజేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. తగిన ఉత్తర్వులు జారీ చేయడం కోసమే బుధవారం నుంచి గురువారానికి వాయిదా వేశామని గుర్తు చేసింది. అంతిమంగా ఈ వ్యాజ్యాలపై విచారణను ఈనెల 26కు వాయిదా వేసింది. పిటిషనర్ల విషయంలో తొందరపాటు చర్యలు వద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.మన్మథరావు గురువారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
పదోతరగతి తెలుగు ప్రశ్నపత్రం మాల్‌ప్రాక్టీస్ ఆరోపణలతో చిత్తూరు ఒకటో పట్టణ ఠాణాలో నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు కోసం మాజీ మంత్రి నారాయణ కుమార్తెలు పొంగూరు శరణి, పొంగూరు సింధూర, అల్లుడు కె.పునీత్, నారాయణ విద్యా సంస్థ సొసైటీకి చెందిన డిప్యూటీ జనరల్ మేనేజరు జె.కొండలరావు, ఎం.కిశోర్, రాపూరు కోటేశ్వరరావు, వీపీఎన్‌ఆర్ ప్రసాద్, వి.శ్రీనాథ్, రాపూరు సాంబశివరావు, వై.వినయ్‌కుమార్, జి.సురేశ్‌కుమార్, ఎం.మునిశంకర్, బి.కోటేశ్వరరావు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఇవీ చూడండి