రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు శాసనసభ హక్కుల సంఘం (ప్రివిలేజ్ కమిటీ) విచారణ పరిధిలోకి వస్తుందని ఆ కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. ‘తమ హక్కులకు భంగం కలిగిందని, మంత్రులు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. స్పీకర్ ప్రివిలేజ్ కమిటీకి పంపించారు. తద్వారా ఎస్‌ఈసీపై విచారణ జరిపే అధికారం కమిటీకి ఉంది’ అని స్పష్టం చేశారు. నెల్లూరులోని తన నివాసంలో కాకాణి మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అంతకుముందు వర్చువల్ విధానంలో సంఘం సభ్యులు సమావేశమై చర్చించిన విషయాలను వెల్లడించారు. గతంలో మహారాష్ట్రలోనూ అక్కడి ఎస్‌ఈసీ తీరుపై సభాసంఘం విచారణ జరిపి, రూల్ 173 కింద గవర్నర్‌కు పంపించిందని గుర్తుచేశారు. తాజా ఉదంతంలోనూ మంత్రులపై నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ వ్యక్తిగత వ్యాఖ్యలు, లేఖలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
వాడివేడిగా చర్చ
ఎస్‌ఈసీ రమేశ్‌కుమార్‌పై మంత్రులు ఇచ్చిన సభాహక్కుల ఉల్లంఘన నోటీసును స్వీకరించడంపై చర్చించేందుకు వర్చువల్ విధానంలో సభాసంఘం భేటీ అయ్యింది. సభ్యులు వరప్రసాద్, మల్లాది విష్ణు, శిల్పా చక్రపాణిరెడ్డి, అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. అసెంబ్లీ రూల్ 212, 213 ప్రకారం సభ్యుల హక్కుల పరిరక్షణకు ఉన్న అన్ని అంశాలనూ విచారించే అధికారం ప్రివిలేజ్ కమిటీకి ఉందని ఛైర్మన్ కాకాణి చెప్పినట్లు తెలిసింది.
‘ఎస్‌ఈసీ ఒక రాజ్యాంగ వ్యవస్థ. ప్రివిలేజ్ కమిటీ కూడా రాజ్యాంగ సంస్థే. ఒక వ్యవస్థపై మరో వ్యవస్థ కలగజేసుకునే పరిస్థితి ఉంటుందా?’ అన్న అనుమానాలు ముందు నివృత్తి కావాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. అనగాని సత్యప్రసాద్ స్పందిస్తూ ‘రాజ్యాంగంలోని 243 అధికరణ ప్రకారం ఎస్‌ఈసీకి విస్తృతాధికారాలుంటాయి. రాజ్యాంగ పరిధిలోనే ఎస్‌ఈసీ వ్యవహరిస్తున్నారు కదా’ అని ప్రశ్నించారు. ‘ఎన్నికల కమిషన్ అధికారాలను ఎక్కడా ప్రశ్నించడం లేదు. ఎన్నికల నిర్వహణకు అభ్యంతరమో, అడ్డుచెప్పడమో లేదు. కానీ, కమిషన్ అధిపతిగా కమిషనర్ తనకు అధికారాలున్నాయంటూ తమపై గవర్నర్‌కు లేఖ రాశారని మంత్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ లేఖలోని అంశాలు తమ హక్కులను భంగపరిచేలా ఉన్నాయని స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ రూల్ 173 ప్రకారం సభాపతి ఆ ఫిర్యాదుపై విచారించాలని ప్రివిలేజ్ కమిటీకి పంపారు. రూల్స్ 212, 213 ప్రకారం కమిటీ ఈ ఫిర్యాదును విచారించవచ్చు’ అని కాకాణి సమాధానమిచ్చారు. ‘అంటే కమిషనర్‌కు నోటీసు ఇస్తారా’ అని సత్యప్రసాద్ ప్రశ్నించారు. ‘ఫిర్యాదులోని తీవ్రతను చూడాలి. సాక్ష్యాధారాలను బట్టి నోటీసు జారీ చేయగలం తప్ప ఇప్పటికిప్పుడేం చేయం కదా?’ అని స్పష్టం చేశారు. ఈ నెలలో పంచాయతీ ఎన్నికలు ముగిశాక లేదా కుదిరితే ఆలోగా కమిటీ భౌతికంగా సమావేశమై విచారణ, నోటీసు జారీపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
ఎస్‌ఈసీని నియమించేది గవర్నరే కదా?
వైకాపా ప్రభుత్వం తన నియంతృత్వ విధానాలకు సభాసంఘాన్ని వాడుకుంటోందని ఎమ్మెల్యే సత్యప్రసాద్ ఆరోపించారు. ‘రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న రమేశ్‌కుమార్‌ను ఉద్దేశించి తీవ్ర పదజాలం వాడిన మంత్రులపై చర్యలు తీసుకోకుండా.. ఎస్‌ఈసీపైనే చర్యలు అంటూ మాట్లాడటం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. గతంలో తెదేపా నుంచి వైకాపాలోకి వెళ్లిన ఎమ్మెల్సీ శివనాథరెడ్డిపై ఫిర్యాదు చేసినప్పుడు.. గవర్నర్ నియమించిన ఎమ్మెల్సీపై సభాహక్కుల చట్టం కింద ఎలా చర్యలు తీసుకుంటారని వైకాపా నేతలు ప్రశ్నించారు. ఎస్‌ఈసీని నియమించింది కూడా గవర్నరే కదా?’ అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి