Ramnath Kovind to Visit Samathamurthy: జగద్గురు రామానుజాచార్యుల వెయ్యేళ్ల పండుగ అంగరంగవైభవంగా సాగుతోంది. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో ఆరేళ్లు శ్రమించి నిర్మించిన 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని భారత ప్రధాని భక్తులకు అంకితం చేశారు. రాష్ట్రపతి నేడు 120 కిలోల స్వర్ణమూర్తిని లోకార్పణం చేయనున్నారు. భద్రవేదిలోని మొదటి అంతస్తులో కొలువైన స్వర్ణమూర్తి ప్రతిష్టాపనకు చినజీయర్‌స్వామి నేతృత్వంలో వేలాది మంది ఋత్వికులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మధ్యాహ్నాం మూడున్నరకు ముచ్చింతల్‌లోని జీవాశ్రమానికి రామ్‌నాథ్ కోవింద్ చేరుకుంటారు. సమతామూర్తి కేంద్రంలో ఆలయాలు, బృహాన్ మూర్తి విగ్రహాన్ని సందర్శిస్తారు. 4 గంటలకు స్వర్ణమూర్తిని లోకార్పణం చేయనున్నారు.
54 అంగుళాల బంగారు ప్రతిమ:
Ramanuja Gold Statue: బంగారు సమతామూర్తి విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ విగ్రహాన్ని పూర్తిగా ముచ్చింతల్‌లోని జీవాశ్రమంలోనే తయారు చేశారు. మైహోం గ్రూపు అధినేతి జూపల్లి రామేశ్వరరావు 27 కిలోల బంగారాన్ని విరాళమిచ్చారు. అమెరికాకు చెందిన మరో భక్తురాలు 8 కిలోలు అందించారు. ఆశ్రమంలో పనిచేసే కార్మికులు తమ వంతుగా సహాయం చేశారు. ఇలా ఎందరో విరాళంగా ఇచ్చిన బంగారంతో 54 అంగుళాల బంగారు ప్రతిమను రూపొందించారు. విగ్రహం కొలువు దీరిన అంతస్తును ప్రపన్న శరణాగత మండపంగా పిలుస్తారు.
పున్నమి చంద్రుడిలా సమతామూర్తి..
Sri Ramanuja sahasrabdi utsav: కారుణ్యం, మాధుర్యం, ఔదార్యం, గాంభీర్యం ఉట్టిపడేలా స్వర్ణంతో రామానుజాచార్యుల ముఖాన్ని తీర్చిదిద్దారు. 36 అంగుళాల ఎత్తులో పూర్తి కృష్ణశిలతో శాస్త్రోక్తంగా తయారు చేశారు. మండపంలోని అన్ని స్తంభాలు రామానుజాచార్యుల చుట్టూ నక్షత్రాకృతిలో ఉంటాయి. వాటి మధ్య పున్నమి చంద్రుడిలా సమతామూర్తి దర్శనమిస్తారు. భద్రవేదిలోని భద్రస్థానంలో స్వర్ణమూర్తిని ఏర్పాటు చేయటంతో... మూడు వైపుల నుంచి చూస్తే వేర్వేరు అందమైన ఆకృతుల్లో రామానుజులు కనిపిస్తారు. 48 స్తంభాలపై 32 శిల్పాలు కనువిందు చేస్తుంటాయి. వీటిని ఆగ్మెంటెడ్ రియాల్టీ టెక్నాలజీతో అనుసంధానం చేశారు. విగ్రహంపై పడేలా పంచవర్ణాలతో దీపాలు అమర్చారు. భద్రవేది మొదటి అంతస్తును అత్యాధునికంగా తీర్చిదిద్దారు. ఆధునిక టెక్నాలజిని వినియోగించి భద్రతా ఏర్పాట్లు చేశారు.
భద్రత కట్టుదిట్టం:
రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా ముచ్చింతల్ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ముచ్చింతల్ వరకు 7 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నాం 1 గంట తర్వాత భక్తులెవరిని సమతామూర్తి దర్శనానికి అనుమతించమని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.
నేడు విగ్రహ ఆవిష్కరణ పూర్తయ్యాక సోమవారం వేద పండితులు శాస్త్రోక్తంగా స్వర్ణమూర్తికి ప్రాణప్రతిష్టాపన చేయనున్నారు.
ఇదీ చూడండి: 'ఐదేళ్ల సీఎం కావాలి.. స్థిరమైన ప్రభుత్వం రావాలి'