President Ramnath Kovind: హైదరాబాద్‌లో రెండు రోజుల పర్యటన ముగించుకుని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దిల్లీకి వెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వచ్చిన రాష్ట్రపతి దంపతులకు గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలికారు. అక్కడి నుంచి హైదరాబాద్ శివారు ముచ్చింతల్‌కు వెళ్లిన రాష్ట్రపతి... సమతామూర్తి కేంద్రాన్ని తిలకించారు. అనంతరం 120 కిలోల స్వర్ణ మూర్తిని లోకార్పణం చేసి.... స్వర్ణ ప్రతిమకు తొలి హారతి ఇచ్చారు. చినజీయర్ స్వామి బంగారు శఠారితో రాష్ట్రపతి కుటుంబసభ్యులను ఆశీర్వదించారు. అనంతరం రాజ్‌భవన్ వసతి గృహానికి చేరుకున్న రాష్ట్రపతి... అక్కడే బస చేశారు. అనంతరం సోమవారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి దిల్లీ వెళ్లారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై, హరియాణా గవర్నర్ దత్తాత్రేయ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, అధికారులు రాష్ట్రపతికి వీడ్కోలు పలికారు.
సమతామూర్తి స్వర్ణ ప్రతిమను లోకార్పణం చేసిన రాష్ట్రపతి
President Ramnath Unveiled Gold statue of Ramanuja: ముచ్చింతల్ ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మారనుందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. శ్రీరామనగరం అద్వైత, సమతా క్షేత్రంగా విరాజిల్లుతుందని పేర్కొన్నారు. సమతామూర్తి రామానుజుల స్వర్ణమూర్తిని నెలకొల్పి చినజీయర్‌స్వామి చరిత్ర లిఖించారని.. స్వర్ణమూర్తి విగ్రహాన్ని లోకార్పణం చేయడం సంతోషంగా ఉందని వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని సమతామూర్తి కేంద్రంలో.. జగద్గురు రామానుజాచార్యుల వెయ్యేళ్ల పండుగ శోభాయమానంగా సాగుతోంది. 54 అంగుళాల సమతామూర్తి 120 కిలోల స్వర్ణ ప్రతిమను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం నాడు ఆవిష్కరించి.. లోకార్పణం చేశారు. స్వర్ణమూర్తి వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుతో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సమతామూర్తి బంగారు విగ్రహానికి రాష్ట్రపతి దంపతులు ప్రత్యేక పూజలు చేసి తొలి హారతి ఇచ్చారు. బంగారు శఠారితో రాష్ట్రపతిని చినజీయర్ స్వామి ఆశీర్వదించారు. భద్రవేదిలోని మొదటి అంతస్తులో జరిగిన ఈ కార్యక్రమంలో.. వేలాది మంది రుత్వికులు వేద మంత్రోచ్చారణలతో ఘోషించారు. రాష్ట్రపతితో పాటు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక వేదికపై ఆశీనులైన ఆయన.. రామానుజాచార్యుల విశిష్టతను కొనియాడారు.
"స్వర్ణమూర్తి విగ్రహాన్ని లోకార్పణం చేయడం సంతోషంగా ఉంది. సమతాస్ఫూర్తి కేంద్రంలో 108 దివ్యక్షేత్రాలకు ప్రాణప్రతిష్ఠ జరిగింది. ముచ్చింతల్ ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మారనుంది. శ్రీరామనగరం అద్వైత, సమతా క్షేత్రంగా విరాజిల్లుతుంది. భక్తి మార్గాన్ని, ధర్మమార్గాన్ని రామానుజాచార్యులు నిర్దేశించారు. సర్వమానవ సమానత్వాన్ని రామానుజులు ఆచరించమని చెప్పారు. మానవజీవన విధానంలో విశిష్టాద్వైతం అంతర్భాగం. గోదావరి నది ఆశీర్వాదంతో సమతామూర్తిని అద్భుత క్షేత్రంగా నెలకొల్పారు."
-రామ్‌నాథ్ కోవింద్, భారత రాష్ట్రపతి
ఇదీ చదవండి: President Ramnath Kovind: సమతామూర్తిని సందర్శించిన రాష్ట్రపతి.. స్వర్ణవిగ్రహం ఆవిష్కరణ