Police security at Mutton Shops : మాంసాహారం ఇష్టపడే వాళ్లు వారంలో కనీసం మూడు, నాలుగుసార్లు అయినా అలాంటి భోజనమే చేస్తుంటారు. చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, చేపల పులుసు, రొయ్యల కూర అంటూ ఎన్ని రకాల వంటకాలు ఉంటాయో అన్నింటిని తరచూ ఆస్వాదిస్తుంటారు. అసలే ఆదివారం మాంసప్రియులకు పండుగ రోజు. పొద్దున్నే లేచి షాపుల దగ్గర మాంసం కోసం లైన్లలో బారులు తీరుతారు. అలాంటిది తక్కువ ధరకు మటన్ దొరుకుతుందటే ఊరుకుంటారా..తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలోను అదే జరిగింది. మాంసప్రియులు భారీగా తరలిరావడంతో ఒకానొక సమయంలో తోపులాట చోటుచేసుకోవడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
మిరుదొడ్డి మండలం అక్బర్‌పేటలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 400 రుపాయలకే కిలో మటన్ విక్రయించారు. దీంతో మాంసం ప్రియులు పెద్దఎత్తున ఎగబడ్డారు. ఉదయం నుంచే భారీగా తరలివచ్చారు. ఆదివారంతో పాటు పెద్దల అమావాస్య కావడంతో వివిధ మండలాల నుంచి భారీగా మాంసం ప్రియలు తరలివచ్చారు. మటన్ తీసుకోవాలంటే సుమారు రెండు నుంచి మూడు గంటల పాటు క్యు కట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకానొక సమయంలో మటన్ షాపుల వద్ద తోపులాట చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు మాంసం దుకాణాల వద్ద ఎటువంటి ప్రమాదం జరగకుండా బందోబస్తు నిర్వహించారు. దుకాణదారుల మధ్య పోటీ వినియోగదారులకు కలిసి వచ్చిందంటూ మటన్ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో వివిధ మండలాల నుంచి మటన్ కోసం ప్రజలు తరలిరావడంతో దుకాణదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
ఇవీ చదవండి: