తెలుగుదేశం నేత పట్టాభిపై దాడి ఘటనలో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 2వ తేదీ ఉదయం విజయవాడ అంబేడ్కర్ కాలనీలోని తన నివాస సమీపంలోనే పట్టాభిపై కొందరు దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో కారు అద్దాలు ధ్వంసమవడమే కాక ఆయనకూ గాయాలయ్యాయి. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా గుణదలకు చెందిన ఆనంద్, వెంకటేశ్, భాగ్యరాజు, భాస్కరరావు, సత్యనారాయణ, తులసీరామ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదిత్య దాడి చేయమంటేనే చేశామని వారు విచారణలో వెల్లడించారు. నిందితులను కోర్టులో హాజరుపర్చగా..న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.
విజయవాడకు చెందిన ఆదిత్య అలియాస్ నానికి నిందితులు ఏడాది క్రితం క్రీడా మైదానంలో పరిచయమయ్యారు. దాడికి 2 రోజుల ముందు వారిని సంప్రదించిన ఆదిత్య ఒకరిపై దాడి చేసి భయపెట్టాలని, ప్రాణహాని తలపెట్టవద్దని చెప్పాడు. అందుకు వారు అంగీకరించారు. 2వ తేదీన పట్టాభి ఇంటి సమీపంలో AP 16 ER 3434 కారుపై దాడి చేయాలని ఆదిత్య వారికి సూచించాడు. వారు అలానే చేశారు. వచ్చినవారిలో కొందరు పట్టాభిని గుర్తించి పరారయ్యారు. దాడి జరిగిన రోడ్డులోని ఓ ఇంట్లోనే సీసీకెమెరాల దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దాడిలో పదిమంది పాల్గొన్నట్టు గుర్తించిన పోలీసులు తొలుత ఒకరిని అదుపులోకి తీసుకోగా అతని నుంచి మిగతా ఐదుగురి వివరాలూ రాబట్టారు.
ఆదిత్యతో ఉన్న పరిచయం వల్లే ఎవరిపై దాడి చేయాలో అడగకుండానే చేసినట్లు నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించారు. ఆదిత్య దొరికితే పూర్తి వివరాలు తెలుస్తాయని భావిస్తున్న పోలీసులు అతని ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
ఇదీ చదవండి: