రాష్ట్ర పోలీసు ఫిర్యాదుల అథారిటీ ఛైర్మన్‌గా మద్రాస్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి.కనగరాజ్ నియామక జీవో అమలును హైకోర్టు నిలుపుదల చేసింది. ఛైర్మన్‌గా నియమితులయ్యే వ్యక్తి నిబంధనల ప్రకారం 65 ఏళ్ల వరకే ఆ పదవిలో కొనసాగుతారని గుర్తుచేసింది. అందుకు భిన్నంగా 78 ఏళ్ల వయసున్న జస్టిస్ కనగరాజ్‌ను నియమించడం సరికాదంది. ఈ నేపథ్యంలో ఆయన నియామకంపై రాష్ట్ర హోంశాఖ ఈ ఏడాది జూన్ 20న జారీచేసిన జీవో 57 అమలును నిలిపివేసింది. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న హోంశాఖ ముఖ్యకార్యదర్శి, ఏపీ రాష్ట్ర పోలీసు కంప్లైంట్స్ అథార్టీ (ఏపీఎస్‌పీసీఏ) ఛైర్మన్, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్‌కు నోటీసులు జారీచేసింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ నియామకాన్ని సవాలు చేస్తూ న్యాయవాది పారా కిశోర్ హైకోర్టులో పిల్ వేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌బాబు వాదనలు వినిపిస్తూ.. ‘నిబంధనలకు విరుద్ధంగా జస్టిస్ కనగరాజ్ నియమాకం జరిగింది. వయసురీత్యా ఆయనకు అర్హత లేదు. సీఎం సిఫారసుతో గతంలో జస్టిస్ కనగరాజ్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా సర్కారు నియమించింది. దాన్ని హైకోర్టు రద్దుచేసింది. దీంతో ఇప్పుడాయనను ఛైర్మన్‌గా నియమించారు. జస్టిస్ కనగరాజ్‌కు సీఎంతో ఉన్న సాన్నిహిత్యమే దీనికి కారణం. జీవో అమలును నిలుపుదల చేయండి’ అని కోరారు. పిటిషనర్ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం.. వయసురీత్యా చూస్తే అనర్హులుగా ఉందంటూ జీవో అమలును సస్పెండ్ చేసింది.
ఇదీ చదవండి: