2015-2021 మధ్య ప్రధాన మంత్రి పట్టణ ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి మంజూరైన ఇళ్ల వివరాలను కేంద్రం వెల్లడించింది. తెదేపా ఎంపీ రామ్మోహన్నాయుడు లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానమిచ్చింది. ఆరేళ్లలో రాష్ట్రానికి 20,37,457 ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపింది. రాష్ట్రంలో 4.45 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తయినట్లు తెలిపిన కేంద్రం.. నిర్మించిన ఇళ్లలో 93.15 శాతం 2015-19మధ్య పూర్తయినట్లు వివరించింది.
నిర్మాణంలో 10,28,169 ఇళ్లు
ప్రస్తుతం నిర్మాణంలో 10,28,169 ఇళ్లు ఉన్నాయని వివరాలను వెల్లడించింది. ప్రాజెక్టుల కోసం రాష్ట్రం 826.20 ఎకరాలు కొనుగోలు చేసిందని.. 2019-20 తర్వాత రీటెండరింగ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలను చేపట్టిందని కేంద్రం పేర్కొంది. రూ.2,996.50 కోట్లతో 54,056 ఇళ్ల నిర్మాణం చేపట్టిందని.. ఇందులో 23 వేల ఇళ్లు పూర్తయినట్లు తెలిపింది.
వైకాపా సభ్యులు ఎన్.రెడ్డెప్ప, బెల్లాన చంద్రశేఖర్, సత్యవతి, మిథున్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎంవీవీ సత్యనారాయణలు అడిగిన మరో ప్రశ్నకు బదులిస్తూ జూన్ 8న జరిగిన 54వ సెంట్రల్ శాంక్షనింగ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో రాష్ట్రానికి 1,74,156 ఇళ్లు మంజూరుచేయడానికి ఆమోద ముద్ర వేసినట్లు చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రానికి కేటాయించిన ఇళ్లలో అనంతపురం జిల్లాకు 1,66,531, చిత్తూరుకు 2,03,066, తూర్పుగోదావరికి 1,85,888, గుంటూరుకు 1,76,279, కడపకు 1,18,164, కృష్ణాకు 2,39,913, కర్నూలుకు 1,47,286, ప్రకాశంకు 1,11,166, నెల్లూరుకు 1,33,871, శ్రీకాకుళానికి 1,08,011, విశాఖపట్నంకు 1,19,726, విజయనగరానికి 1,11,993, పశ్చిమగోదావరికి 2,15,517 కేటాయించినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: గ్రామాల అభివృద్ధి బాధ్యత సర్పంచులదే: మంత్రి పెద్దిరెడ్డి