ఇంధన ధరల పెరుగుదలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అన్నదాతలపై పెట్టుబడి ఖర్చు పెరిగింది. రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం 1.51 కోట్ల ఎకరాలు. ఖరీఫ్, రబీలలో రెండు పంటలు సాగయ్యే పొలాలున్నాయి. మొత్తంగా 1.71 కోట్ల ఎకరాలకు చూసినా.. మూడేళ్లలో పెట్టుబడి వ్యయం రూ.6,800 కోట్లకు పైనే పెరిగినట్లు లెక్క.
ఉభయ గోదావరి జిల్లాల్లో వరికోత యంత్రాలకు.. మూడేళ్ల కిందట గంటకు రూ.1,700 వరకు ఉండేది. నిరుడు రూ.2,400 వరకు తీసుకున్నారు. ప్రస్తుతం డీజిల్ లీటరు రూ.వందకు చేరువ కావడంతో ధర గత ఏడాదికంటే మరో రూ.500 వరకూ పెరిగే ప్రమాదముంది.
తొలకరిలో మెట్టపంటల సాగు దుక్కి దున్నకంతో మొదలవుతుంది. నాగళ్లకు గతేడాది ఎకరాకు రూ.1,700 చొప్పున తీసుకునేవారు. ఇప్పుడు రూ.2వేలు చేశారు.
యంత్రాలే ఆధారం
దశాబ్దాల కిందట వ్యవసాయమంతా ఎద్దులతోనే చేసేవారు. క్రమంగా యంత్రాల వాడకం పెరగడంతో కాడెడ్లు కనుమరుగయ్యాయి. అన్ని పనులకు రైతులు ట్రాక్టర్లపైనే ఆధారపడుతున్నారు. పెట్రో ధరల పెరుగుదలతో పెట్టుబడి ఖర్చులూ అధికమయ్యాయి. అన్ని పంటలకు సగటున చూస్తే.. ఎకరాకు రూ.3వేలకు పైనే పెరిగాయి. అయిదెకరాలు సాగు చేసే రైతుకు ఏటా రూ.15వేల వరకు అదనపు భారమయ్యాయి.
* గొర్రు, గుంటకలు, విత్తనం ఎద పెట్టడం, తర్వాత అంతర సేద్యం రూపంలో చూస్తే.. ఎకరాకు ఆరు దఫాలు తోలించాలి. అంటే ఒక్కో ఎకరాపై రూ.1,000 వరకు పెరిగింది. పంట నూర్పిడి ఖర్చు రూపంలోనూ మరో రూ.500 వరకు భారం పడనుంది.
* సరకు రవాణా.. పొలం నుంచి ఇంటికి తీసుకురావడానికి గతంలో రూ.300 ఉండేది. ఇప్పుడు రూ.500 అవుతోంది. మార్కెట్‌కు సరకు తీసుకెళ్లాలంటే ఒక్కో క్వింటాలుకు రూ.50 వరకు పెరుగుతోంది. అంటే ఎకరాకు 25 క్వింటాళ్ల మిర్చికి మొత్తంగా రవాణాపై పరిశీలిస్తే.. రూ.1,250 వరకు అధికమవుతోంది.
* గుంటూరు జిల్లా పల్నాడులోని జూలకల్లు నుంచి గుంటూరు యార్డుకు మిర్చి బస్తాలు తీసుకెళ్లాలంటే.. మూడేళ్ల కిందట ఒక బస్తాకు రూ.40 ఖర్చు అయ్యేది. ఇప్పుడది రూ.80 పైగా అయింది. ఈ ఏడాది మరింత పెరగనుంది. పొలంలో కలుపులు, కోతలు, నూర్పిడికి కూలీలను తరలించేందుకు ఆటోకు సగటున 10 కిలోమీటర్లకు గతంలో రూ.500-600 తీసుకునేవారు. ఈసారి ఎంత పెంచుతారో తెలియదని రైతులు వాపోతున్నారు.
ఎకరా వరి సాగుపై రూ.4వేల పైనే భారం
రాష్ట్రంలో ఖరీఫ్, రబీలో కలిపి 60 లక్షల ఎకరాల్లో వరి వేస్తారు. మూడేళ్ల కిందటితో చూస్తే సగటున ఎకరాకు రూ.4,110 వరకు పెరిగాయి. అంటే అయిదెకరాలు వరి వేసే రైతుపై రూ.20వేల పైనే అదనపు భారం పడుతోంది. రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం ప్రాతిపదికన చూస్తే.. మొత్తం రూ.2,370 కోట్లు మేర రైతుల పెట్టుబడి పెరిగింది.
ట్రాక్టరు తోలకం సాలుకు రూ.200 వరకు పెరిగింది
ఆకు మడి నుంచి దమ్ము చేయించడం వరకు అన్నిటి రేట్లు పెంచేశారు. గతంలో పోలిస్తే సాలుకు రూ.100 నుంచి రూ.200 వరకు పెరిగింది. డీజిల్ ధరలతోపాటు యంత్ర పరికరాల రేట్లు కూడా పెరిగాయి. అన్నీ కలిపితే ఎకరాకు ఎంతలేదన్నా.. రూ.3వేల పైనే పెరుగుతాయి.- ఎన్.వెంకటరమణ, కొవ్వలి, దెందులూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా
మిరప సాగులో రెట్టింపైన వ్యయం
ఎకరాకు రూ.2 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టే.. మిరప సాగులో యంత్రసేద్య భారం దాదాపు రెట్టింపైంది. 2018లో ఎకరాకు రూ.14వేల వరకు ఖర్చవుతుండగా.. ప్రస్తుతం రూ.24వేలకు పైగా చేరింది. రాష్ట్రంలో ఏటా 4 లక్షల ఎకరాల్లో మిరప సాగవుతుంది. సగటున ఎకరాకు రూ.10వేల భారం చొప్పున చూస్తే.. మిరప రైతుల పెట్టుబడి వ్యయం ఏడాదికి రూ.400 కోట్ల మేర పెరిగింది.
* కొన్ని ప్రాంతాల్లో యంత్ర సేద్య ధరలు మరింత అధికంగా ఉన్నాయి. కర్నూలు జిల్లా సీబెళగళ్ ప్రాంతంలో రెండు నాగళ్లకు ఎకరానికి రూ.2,500, గొర్రు/గుంటలకు రూ.800 చొప్పున వసూలు చేస్తున్నారు.
మిర్చి పెట్టుబడి భారీగా పెరుగుతోంది
లాక్‌డౌన్ తర్వాత ఏ వస్తువు చూసినా కొనలేకపోతున్నాం. మిర్చి పెట్టుబడి కూడా భారీగా పెరుగుతోంది. విత్తనాల నుంచి అన్నీ పెరిగాయి. ఎకరాకు మొక్క నాటేనాటికి రూ.40వేల పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. చివరకు కోతలతో కలిపితే.. రూ.2 లక్షల పైమాటే. రైతు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మరే పని చేయలేం. పొలంపైనే ఆధారపడుతున్నాం. ఒక సంవత్సరం దండగ వచ్చినా.. మరో ఏడాది గట్టెక్కిస్తుందనే ఆశ.- శివారెడ్డి, జూలకల్లు, పిడుగురాళ్ల మండలం, గుంటూరు జిల్లా
అయిదెకరాల పత్తి రైతుపై రూ.25 వేల భారం
రాష్ట్రంలో 15 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తారు. ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో గత మూడేళ్లలో.. ఒక్కో ఎకరాపై రూ.5,200 వరకు అధికమైంది. అంటే 57% వరకు పెరిగింది. అయిదెకరాలు పత్తి వేస్తే.. రూ.25వేల వరకు అదనపు పెట్టుబడులు తప్పడం లేదు. మొత్తంగా రాష్ట్రంలో సాగు చేసే పత్తి విస్తీర్ణం ప్రకారం.. రూ.765 కోట్ల మేర అదనపు ఖర్చు మోయాల్సి వస్తోంది.
వేరుసెనగపై ఎకరాకు రూ.6,200 పైనే మోత
పెరిగిన డీజిల్, పెట్రోలు ధరలతో.. వేరుసెనగ రైతు ఒక్కో ఎకరాకు రూ.6,200 భారం మోస్తున్నారు. వానలు కనికరించినా, కన్నెర్ర చేసినా దిగుబడులు ప్రశ్నార్థకంగా మారే పరిస్థితిలో పెట్టుబడులు పెరుగుతుండటం రైతుల్ని కలవరానికి గురిచేస్తోంది. ఖరీఫ్, రబీలో రాష్ట్రవ్యాప్తంగా 21.30 లక్షల ఎకరాల్లో వేరుసెనగ వేస్తారు. ఈ లెక్కన ఏడాదికి రూ.1,320 కోట్ల మేర అదనపు వ్యయం అవుతోంది.
వాతావరణం అనుకూలించకుంటే ఖర్చు మరింత పెరుగుతోంది
వేరుసెనగ 30 ఎకరాలు వేస్తాను. విత్తనం, దుక్కిలోకి ఎరువులు, ట్రాక్టరు సేద్యం కలిపి గతంలో రూ.5లక్షలు అయ్యేది. ఇప్పుడు రూ.7లక్షల వరకు చేరింది. ఆరు నెలల్లోనే డీజిల్ రేట్లు భారీగా పెరిగాయి. విత్తనాల నుంచి సేద్యం ఖర్చుల వరకు భారంగా మారాయి. మిగిలేదేమీ ఉండటం లేవు. వాతావరణం అనుకూలించకపోతే.. ఖర్చులు మరింత పెరుగుతాయి. అమ్ముకోబోయే నాటికి ధర ఉండటం లేదు.
ఇదీ చదవండి: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రద్దును సవాల్ చేస్తూ హైకోర్టులో ఎస్‌ఈసీ పిటిషన్