రాజధాని ప్రాంత రైతులకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మద్దతు పలికారు. వారికి న్యాయం జరిగేవరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అన్నదాతల ఆందోళనలకు మద్దతుగా జనసేనాని అమరావతిలో పర్యటించారు. తొలుత మంగళగిరి మండలం నవులూరులో రైతుల దీక్షకు పవన్ సంఘీభావం తెలిపారు. అనంతరం రైతులకు అభివాదం చేస్తూ ఎర్రబాలెం చేరుకున్నారు. ఈ సందర్భంగా మహిళా రైతులు తమ సమస్యలను పవన్‌కు వివరించారు. అమరావతి రాజధానిని ఏకీభవిస్తున్నామని అసెంబ్లీలోనే ఆనాడు జగన్ చెప్పారని పవన్ గుర్తుచేశారు.
రహదారులపై వచ్చి రైతులు ఆందోళన చేస్తున్నారంటే ప్రతిఒక్క ప్రజాప్రతినిధి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సాక్షాత్తూ ప్రభుత్వమే మోసం చేస్తే బాధలు ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా న్యాయం చేస్తుందని ఓట్లేసి గెలిపిస్తే... వారికి ఇచ్చే కానుక ఇదేనా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఒప్పుకొని ఇప్పుడు మాట మారుస్తారా అని నిలదీశారు. మాట తప్పడమంటే ధర్మం తప్పడమేనని స్పష్టం చేశారు.
'ఇవాళ్టికీ రాష్ట్ర ప్రభుత్వం రాజధానిపై స్పష్టమైన ప్రకటనా ఎక్కడా చేయట్లేదు. అన్ని జిల్లాల ప్రజలు ఎన్నుకుంటే జగన్ సీఎం అయ్యారు. కొన్ని జిల్లాల కోసమే ముఖ్యమంత్రిగా పనిచేస్తానంటే కుదరదు. ఒక సుస్థిరత కోసం 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు. ఇవాళ ప్రజలు తీవ్ర గందరగోళంలో ఉన్నారు. ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టాలని చూస్తే ఊరుకోము. అమరావతిపై వైకాపా ప్రభుత్వానికి అంత కక్ష ఎందుకు.?. అవినీతి జరిగి ఉంటే చట్టాలు ఉన్నాయి.. వారిని శిక్షించండి. నాయకులపై కోపం.... ప్రజలపై చూపించకండి. వైకాపా నాయకులు రాజధానిపై స్పష్టమైన ప్రకటన చేస్తే మా కార్యాచరణ చెబుతా. రాజధాని ప్రాంత రైతులకు న్యాయం జరిగేవరకు మేం అండగా ఉంటాం. పెయిడ్ ఆర్టిస్టులు, ఎడారి వంటి పదాలు ఉపయోగించడం క్షమించరాని విషయం.
ఓట్ల కోసం నేను రాలేదు మార్పు కోసం వచ్చా. మభ్య పెట్టి అధికారంలోకి రాను... మార్పు ద్వారానే వస్తా. అన్నం పెట్టే రైతులకు అన్యాయం జరుగుతుంటే బాధ కలుగుతుంది. ప్రజలకు భరోసా కల్పించకుండా ముందుకెళ్తే బాధపడతారు. అన్నదాతలపై కేసులు పెట్టడం అన్యాయం' అని పవన్ కల్యాణ్ అన్నారు. రాజధాని ప్రాంత రైతుల భవిష్యత్తును కాపాడటం తమ బాధ్యత అని పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:'మేము పెయిడ్ ఆర్టిస్టులం కాదు... ఇవిగో మా ఆధార్ కార్డులు'