రాజధాని విషయంలో కాలయాపన చేయకుండా... తక్షణం అధికారిక ప్రకటన చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. వైకాపా నాయకుల ప్రకటనలు... ప్రజల్ని గందరగోళానికి గురిచేస్తున్నాయని ఓ ప్రకటనలో అభిప్రాయపడ్డారు. పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవాలనే ఉద్దేశంతోనే అధికార పార్టీ నేతలు ఇలా ప్రవర్తిస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ పదేపదే చెబుతున్నారని... అధికారం చేతిలో ఉన్నప్పుడు కేసులు నమోదు చేయొచ్చు కదా అని ప్రశ్నించారు. పాలన కేంద్రీకృతం కావాలి... అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని జనసేన కోరుకుంటున్నట్లు పవన్ స్పష్టం చేశారు. రాజధానిని రాయలసీమలో పెడతారో, ఉత్తరాంధ్రలో పెడతారో స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అమరావతికి అంగీకారం తెలిపారని గుర్తుచేశారు.
ఇప్పుడు వేరేచోట రాజధాని అంటున్నారని దుయ్యబట్టారు. పాలకుల నిర్ణయాలతో ఇప్పటికే రాజధాని త్రిశంకు స్వర్గంలా మారిపోయిందని పవన్ వ్యాఖ్యానించారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ఎలా న్యాయం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. కమిటీల పేరుతో దాగుడుమూతలు ఆపాలని హితవుపలికారు. రాజధాని భూముల విషయంలో తనపై వైకాపా నేతలు చేసిన విమర్శలకు పవన్ ధీటుగా సమాధానమిచ్చారు.
భూములు ఇవ్వబోమని చెప్పిన రైతులపై భూ సేకరణ చట్టం ప్రయోగించవద్దని, బలవంతంగా భూములు సేకరిస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు. అప్పటి ప్రభుత్వానికి చెప్పి... రైతుల పక్షాన నిలిచానని పవన్ గుర్తుచేశారు. ఇపుడు కూడా రాజధాని కోసం భూములను త్యాగం చేసి రోడ్డునపడ్డ రైతులకు అండగా నిలుస్తున్నానని స్పష్టం చేశారు.
తానెప్పుడూ రాజధాని నిర్మాణానికి వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. 33 వేల ఎకరాలు అవసరమా..? అని ప్రశ్నించానని చెప్పారు. ఒక వేళ ప్రభుత్వం మారితే భూములు ఇచ్చిన రైతుల భవిష్యత్తు ఏమిటని భయపడ్డానంటూ వివరించారు. 2015 ఆగస్టు 23న పెనుమాకలో పర్యటించిన సందర్భంగా తాను మాట్లాడిన వీడియోను పవన్ ట్విట్టర్లో పెట్టారు.
ఇదీ చదవండి :