ఏడాదిన్నరపాటు సుదీర్ఘంగా సాగిన జిల్లా, మండల పరిషత్ ఎన్నికల ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. ఈ ఎన్నికల కోసం రెండుసార్లు నోటిఫికేషన్లు ఇవ్వడం, తొలి నోటిఫికేషన్ వెలువడిన ఏడాదిన్నర తరువాత ఫలితాలు వెలువడటం రాష్ట్ర ఎన్నికల సంఘం చరిత్రలో తొలిసారి. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం 2020 మార్చిలో తొలి నోటిఫికేషన్ విడుదల చేసింది.అదే నెల 21న పోలింగ్ నిర్వహించి 24న ఫలితాలు ప్రకటించాలి. నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక కొవిడ్ కారణంగా పరిషత్ ఎన్నికలను మార్చి 15న ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఎక్కడ నిలిచిపోయాయో అక్కడి నుంచి మళ్లీ పరిషత్ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు 2021 ఏప్రిల్ 1న రెండోసారి ప్రకటన ఇచ్చింది. 515 జడ్పీటీసీ, 7,220 ఎంపీటీసీ స్థానాలకు ఈ ఏడాది ఏప్రిల్ 8న పోలింగ్ నిర్వహించారు. షెడ్యూల్ ప్రకారం 10న ఓట్లు లెక్కించి అదే రోజు ఫలితాలు ప్రకటించాలి. రెండోసారి జారీ చేసిన నోటిఫికేషన్‌ను పలువురు హైకోర్టులో సవాల్ చేశారు. కోర్టు ఆదేశాలతో ఓట్ల లెక్కింపు నిలిచిపోయింది. ఈ కేసులో హైకోర్టు ధర్మాసనం తాజాగా ఇచ్చిన తీర్పుతో ఎన్నికల సంఘం ఆదివారం ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి చేసి, విజేతలను ప్రకటించింది.
ఇదీ చదవండి: tdp: ప్రజల స్వేచ్ఛను హరించి గెలిచారు