రాష్ట్రంలో కొవిడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 21 మంది ఉన్నతాధికారులకు వేర్వేరు బాధ్యతల్ని అప్పగిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. మరికొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులను జిల్లా ప్రత్యేకాధికారులుగా నియమించారు. తక్షణమే కొవిడ్ నిర్వహణకు సంబందించి ప్రభుత్వం అప్పగించిన బాధ్యతల్లో చేరాల్సిందిగా ముఖ్యమంత్రి కార్యాలయం ఈ కమిటీకి ఆదేశాలు ఇచ్చింది. కొవిడ్ కేంద్రాలు, ఆస్పత్రుల్లో నాణ్యమైన సేవల పర్యవేక్షణకు సీనియర్ ఐఏఎస్ అధికారి ఎం.టి కృష్ణబాబును నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.
కొవిడ్ రోగులు ట్రేసింగ్, టెస్టింగ్ లాంటి కార్యక్రమాల పర్యవేక్షణకు కొవిడ్ మేనేజ్ మెంట్ ముఖ్యకార్యదర్శి ఎం. రవిచంద్రను నియమించారు. సీసీటీవీ, హెల్ప్ డెస్క్ పర్యవేక్షణ కోసం పీయూష్ కుమార్‌ని నియమించారు. 104 కాల్ సెంటర్ల నిర్వహణను బాబు.ఏ పర్యవేక్షించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈఓ మల్లికార్జునను ల్యాబ్‌ల నిర్వహణ, ఆరోగ్య శ్రీ ఆస్పత్రుల్లో కొవిడ్ సేవల కోసం నియమించారు. కొవిడ్ మందుల కొనుగోళ్లు, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం విజయరామరాజును నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు. కొవిడ్ ఆస్పత్రుల్లో మెడికల్ ఆక్సిన్ సరఫరాను షన్మోహన్‌కు అప్పగించారు.
క్లినికల్ మేనేజ్ మెంట్ కోసం వినోద్ కుమార్‌ను నియమించారు. ప్రైవేటు ఆస్పత్రులు ఎక్కువ ఫీజులు వసూళ్ల ఫిర్యాదుల పర్యవేక్షణను ఐపీఎస్ అధికారులు అభిషేక్ మోహంతి, కోయ ప్రవీణ్‌కి ప్రభుత్వం అప్పగించింది. కొవిడ్ సమాచారం, సామాజిక మాధ్యమాలు ఇతర అంశాలను ఆర్జా శ్రీకాంత్‌కు అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వం... 2019కి చెందిన 11 మంది ఐఏఎస్ అధికారులకు 104 కాల్ సెంటర్ బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు ఇచ్చారు. కొవిడ్ అంశాల పర్యవేక్షణకు జిల్లాకు ఒకరు చొప్పున 13 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను ఇంఛార్జులుగా నియమిస్తూ... రాష్ట్రప్రభుత్వం ఆదేశాలిచ్చింది. తక్షణం వీరందర్నీ బాధ్యతలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు వెలువడ్డాయి. 16వ తేదీ ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి జగన్ నిర్వహించే వీడియో కాన్ఫరెన్సుకు ఆయా జిల్లాల నుంచి హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండీ... కరోనా సెకండ్ వేవ్: రాష్ట్రంలో ఒక్కరోజులో.. 5 వేలు దాటిన కొవిడ్ కేసులు