తెలంగాణలో నిరుద్యోగ సమస్యలపై వైఎస్ షర్మిల ఇందిరా పార్క్ ముందు ఉన్న ధర్నాచౌక్ వద్ద ఇవాళ ఉద్యోగ దీక్ష చేపట్టనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ దీక్షకు పోలీసులు ఒక్కరోజు మాత్రమే అనుమతి ఇచ్చారు. నిరుద్యోగులు, విద్యార్థులు, వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, వైఎస్.రాజశేఖరెడ్డి అభిమానులు కార్యక్రమంలో పాల్గొంటారని షర్మిల అనుచరులు తెలిపారు. వైఎస్ షర్మిల దీక్షకు ఇతర పార్టీల నేతలు సైతం మద్దతు పలికే అవకాశం ఉందని షర్మిల అనుచరులు పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లాలో షర్మిల ఇటీవల నిర్వహించిన సంకల్ప సభలో నిరుద్యోగుల సమస్యలపై పోరాడనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడం వల్ల పలువురు బలవన్మరణం చేసుకున్నారని... కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలపై షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో లక్షా 90 వేలకు పైగా ఉన్న ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసి... నిరుద్యోగులకు న్యాయం చేయాలని షర్మిల మూడు రోజుల దీక్షకు పూనుకున్నారు. కానీ పోలీసులు ఒక్కరోజు మాత్రమే దీక్షకే అనుమతి ఇచ్చారు. దీంతో దీక్షను ఒకే రోజు చేయనున్నట్లు షర్మిల అనుచురులు వెల్లడించారు.
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో సభలు, కార్యక్రమాలు నిర్వహించవద్దని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే హైదరాబాద్లో రోజురోజుకీ కొవిడ్ సేకండ్ వేవ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మాస్కు తప్పనిసరిగా ధరించాలని.. లేదంటే వెయ్యి రూపాయలు ఫైన్ కట్టాల్సి వస్తుందని ప్రభుత్వం నిబంధనలు సైతం జారీ చేసింది.
ఇదీ చూడండి : దారుణం: ఆరుగురిని హత్య చేసిన ఆగంతుకుడు