కర్నూలు జిల్లాలో...
కర్నూలు జిల్లా బేతంచెర్ల నగర పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం రెండవ రోజు కొనసాగింది. 2020 జనవరి 26న బేతంచర్ల నగర పంచాయతీగా మారింది. మొట్టమొదటి సారిగా జరుగుతున్న కారణంగా పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి.
అనంతపురం జిల్లాలో..
అనంతపురం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతోంది. పెనుకొండలో రెండో రోజు నామినేషన్లు స్వీకరించారు. ఇవాళ ఆఖరి రోజు కావడంతో ఈ ప్రక్రియ ఉపందుకోనుంది. నామినేషన్ కేంద్రాల వద్ద రెండంచెల భద్రత ఏర్పాటు చేసి పట్టణంలో 144 సెక్షన్ విధించామని, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు నిర్వహించేలా సహకరించాలని అన్ని పార్టీలకు సూచించినట్లు డీఎస్పీ రమ్య చెప్పారు.
నెల్లూరులో నామినేషన్ల పర్వం..
నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్లు రెండో రోజు కోలాహలంగా సాగాయి. పలువురు అభ్యర్థులు తమ అనుచరగణంతో భారీ ఊరేగింపులు నిర్వహించి, నామినేషన్లు దాఖలు చేశారు. వైకాపా, జనసేన, సీపీఎం పార్టీల అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్లు అందించారు. నామినేషన్ల స్వీకరణకు శుక్రవారం చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది.
దర్శిలో నామినేషన్ల జోరు..
ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం రెండవ రోజు కొనసాగింది. గతేడాది దర్శి నగర పంచాయతీగా మారింది. మొట్టమొదటి సారిగా ఎన్నిక జరుగుతున్న కారణంగా అధికార, విపక్షాలు ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.
నేటితో నామినేషన్లు దాఖలుకు గడువు ముగియనుండడం వల్ల భారీ ఎత్తున నామినేషన్లు దాఖలయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఇదీ చదవండి:
ఉత్సాహంగా.. ఉద్వేగంగా.. అమరావతి మహా పాదయాత్ర సాగిందిలా..