అమరావతికి రైల్వే లైను నిర్మాణంలో కాస్ట్ షేరింగ్ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో.. ఆ విషయంలో ఎటువంటి పురోగతి లేదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఎర్రుపాలెం-నంబూరు వయా అమరావతి 56.63 కిలోమీటర్ల రైల్వే లైను నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనను 2017-18 ఏడాది బడ్జెట్‌లో ప్రస్తావించారని.. 1732.56 కోట్ల రూపాయల అంచనాతో డీపీఆర్ తయారుచేసి తదుపరి ఆమోదం కోసం నీతిఆయోగ్‌కు అందించారు.. ఖర్చులో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామంతో చేపడితే మంచిదని నీతిఆయోగ్ సూచించిందని రైల్వే శాఖ పేర్కొన్నది.
అమరావతికి రైల్వే లైను నిర్మాణం విషయాన్ని ఈ ఏడాది మార్చిలో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో రైల్వే పద్దులపై చర్చలో తెదేపా రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ లేవనెత్తారు. కొత్త లైను నిర్మాణంపై స్పష్టత ఇస్తూ... కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ ఎంపీకి లేఖ ద్వారా వివరాలు తెలియజేశారు. కాస్ట్ షేరింగ్ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం విముఖత చూపడంతో.. ప్రాజక్టు తదుపరి అనుమతులు, ఆమోదం కోసం ఎటువంటి చర్యలు తీసుకోలేదని పియూష్ గోయల్ తేల్చి చెప్పారు.
గుంటూరు, కొత్త గుంటూరు, మంగళగరి రైల్వే స్టేషన్లలో అన్ని వసతులు కల్పించి నవీకరణ చేపట్టిట్లు రైల్వే మంత్రి తెలిపారు. తెనాలి-గుంటూరు లైను డబ్లింగ్ పనులు పూర్తయ్యాయన్న రైల్వేమంత్రి.. పగిడిపల్లి-గుంటూరు లైను తమ ప్రాధాన్యత ప్రాజక్టుల్లో లేదని.. అందువల్ల ఆ లైను నిర్మాణ పనులు ప్రస్తుతం చేపట్టడం లేదన్నారు. ప్రస్తుతం అత్యధిక రద్దీ ఉన్న లైన్లు మాత్రమే ప్రాధాన్యత కింద చేపట్టి పూర్తి చేయడం జరుగుతోందని స్పష్టత ఇచ్చారు.
ఇదీ చదవండీ... Amul Pala Velluva: పశ్చిమగోదావరిలో 'అమూల్ పాల వెల్లువ' ప్రారంభం