High Speed Corridor: దేశంలోని వివిధ నగరాల మధ్య హైస్పీడ్ రైల్ కారిడార్లు నిర్మించే కసరత్తు జరుగుతోంది. మన రాష్ట్రానికి మాత్రం అందులో చోటు దక్కడం లేదు. 5కోట్ల జనాభా, విజయవాడ, విశాఖ, గుంటూరు, తిరుపతి వంటి ముఖ్య నగరాలు, వివిధ వ్యవసాయ, వాణిజ్య కేంద్రాలు, 5 నౌకాశ్రయాలు ఉన్న రాష్ట్రం పట్ల రైల్వేశాఖ చిన్నచూపు చూస్తోంది. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండి, నిత్యం ఎక్కువ సంఖ్యలో రైళ్లు నడిచే కీలక మార్గాలు రాష్ట్రంలో ఉన్నప్పటికీ రైల్వేశాఖ పరిగణనలోకి తీసుకోవడం లేదు.
విజయవాడ నుంచి విశాఖ, హైదరాబాద్, చెన్నై మార్గాల్లో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుంది. ఆయా మారాల్లో ప్రయాణించే రైళ్లలో సీట్ల రిజర్వేషన్‌కు ఎప్పుడూ వెయిటింగ్ లిస్ట్ కనిపిస్తుంది. రాయలసీమ వాసులు గుంటూరు, విజయవాడకు చేరుకునేందుకు బెంగళూరు- విజయవాడ లైన్ కీలకమైనది. ఆయా మార్గాల్లో రైళ్ల వేగం గరిష్ఠంగా 110 నుంచి 120 కిలో మీటర్ల మించి లేకపోవడంతో ప్రయాణానికి ఎక్కువ సమయం పడుతోంది. అదే హైస్పీడ్ రైలు కారిడార్ వస్తే ఇప్పుడున్న ప్రయాణ సమయంలో నాలుగింట మూడొంతులు తగ్గుతుంది. విమానాలు, సొంత వాహనాల్లో రాకపోకలు సాగించేవారూ హైస్పీడ్ రైళ్లలో వెళ్లేందుకు మొగ్గుచూపుతారు.
హైస్పీడ్ రైళ్లతో పలు ప్రయోజనాలు దక్కనున్నాయి. హైస్పీడ్ రైల్ కారిడార్‌లో గంటకు కనీసం 250 కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణించేలా నిర్మిస్తారు. ఈ కారిడార్‌లో ఎక్కడా లెవెల్ క్రాసింగ్‌లు ఉండవు. ఈ ట్రాక్‌పై అత్యంత వేగంతో రైళ్లు ప్రయాణిస్తాయి కాబట్టి.. ట్రాక్‌పైకి మనుషులుగానీ, జంతువులుగానీ రాకుండా ఇరువైపులా ప్రహారీ నిర్మిస్తారు. పరిమితంగా కొన్ని ముఖ్యమైన స్టేషన్లలో మాత్రమే రైళ్లు ఆగుతాయి. ముంబయి-అహ్మదాబాద్ మధ్య 508 కిలోమీటర్ల మేర హైస్పీడ్ రైల్ కారిడార్ పనులు జరుగుతున్నాయి. 2028కి దీనిని పూర్తిచేసి, బుల్లెట్ రైలు నడపాలని కేంద్రం భావిస్తోంది.
ఇవే కాకుండా నేషనల్ రైల్ ప్లాన్ కింద దిల్లీ- వారణాసి మధ్య 958 కిలోమీటర్లు, నాగపూర్-ముంబయి మధ్య 736 కిలోమీటర్లు, దిల్లీ- అహ్మదాబాద్ మధ్య 886 కిలో మీటర్లు, దిల్లీ-అమృత్‌సర్ మధ్య 480 కిలోమీటర్లు, హైదరాబాద్- ముంబయి మధ్య 711 కిలో మీటర్లు, వారణాసి- హౌరా మధ్య 760 కిలోమీటర్లు, చెన్నై-మైసూర్ మధ్య 435 కిలోమీటర్ల కారిడార్లను ఆమోదించారు. వీటిలో కొన్నింటికి డీపీఆర్‌లు, మరికొన్నింటికి సర్వేలు జరుగుతున్నాయి. ఇటీవలే కొత్తగా హైదరాబాద్-బెంగళూరు మధ్య 618 కిలోమీటర్లు, నాగపూర్- వారణాసి మధ్య 855 కిలోమీటర్లు, అమృత్‌సర్- జమ్ము మధ్య 190 కిలో మీటర్లు, పట్నా-గౌహతి మధ్య 850 కిలోమీటర్ల హైస్పీడ్ రైల్ కారిడార్లు ప్రతిపాదించారు. వీటిలో హైదరాబాద్- బెంగళూరు కారిడార్ మన రాష్ట్ర పరిధిలో కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని 275 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. అలాగే చెన్నై- మైసూర్ కారిడార్ చిత్తూరు మీదగా వెళ్తుంది.
హైస్పీడ్ రైళ్లతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. విజయవాడ నుంచి విశాఖకు 350 కిలోమీటర్ల దూరం కాగా... రైలు ప్రయాణం 6 నుంచి 7 గంటలు పడుతోంది. హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మించి, సగటున గంటకు 250 కిలోమీటర్ల వేగంతో రైలు నడిపితే... కేవలం గంటన్నరలో చేరుకోవచ్చు. విజయవాడ నుంచి సికింద్రాబాద్‌కు 348 కిలోమీటర్ల దూరం కాగా... రైలులో చేరేందుకు 5 నుంచి 6 గంటలు పడుతోంది. అదే రోడ్డు మార్గంలో 280 కిలోమీటర్ల ఉంది. దీనికి సమాంతరంగా హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మిస్తే... గంట 15 నిమిషాల్లో చేరుకోవచ్చు. విజయవాడ -చెన్నై మధ్య 431 కిలోమీటర్ల ఉండే రైలు మార్గంలో... ప్రయాణ సమయం 7 నుంచి 8 గంటలు ఉంటోంది.
హైస్పీడ్ రైలు మార్గంలో వేగంగా నడిచే రైలు నడిపితే... 2గంటల్లో చేరేందుకు వీలు కలుగుతుంది. విజయవాడ నుంచి రాయలసీమ మీదగా బెంగళూరుకు 735 కిలోమీటర్ల దూరం రైలు మార్గం ఉంది. ఈ రూట్‌లో ప్రయాణ సమయం 12 నుంచి 14 గంటలు పడుతోంది. అదే హైస్పీడ్ రైలు నడిపితే 3 నుంచి 4 గంటల్లో చేరుకోవచ్చు. రాయలసీమలోని పలు ప్రాంతాలకు చెందినవారు విజయవాడకు 2 గంటల్లో చేరుకునేందుకు అవకాశం ఉంటుంది.
ఏపీ లాంటి భౌగోళిక ప్రాంతం ఉండే కేరళలో సుదూర ప్రాంతానికి వేగంగా చేరుకునేందుకు సెమీ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు చేపట్టారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని నగరాలను కలుపుతూ హైస్పీడ్ రైలు ప్రాజెక్టులు వస్తుంటే... మన రాష్ట్రంలోని నగరాలకు తీసుకురావాలన్న విషయాన్ని ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. హైస్పీడ్ అవసరాన్ని కేంద్రానికి నివేదించి, ప్రాజెక్టుల కోసం ఒత్తిడి చేయాల్సిన నేతలు.. కనీస మాత్రం కూడా దృష్టి పెట్టడం లేదు. పొరుగు రాష్ట్రాలకు హైస్పీడ్ రైలు కారిడార్లు వస్తుంటే, రాష్ట్రంలో ఆ ఊసే కనిపించడం లేదు.
ఇదీ చదవండి: