రాష్ట్రంలో నవంబరు 2 నుంచి విద్యా సంస్థలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. కంటెయిన్‌మెంట్ జోన్లలో తరగతులు ఉండవని తెలిపారు. గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. ‘విద్యార్థులు తరగతులకు హాజరయ్యే ముందు తల్లిదండ్రుల నుంచి సమ్మతి లేఖలు తీసుకుంటాం. ఆన్‌లైన్‌లో బోధన యథావిధిగా ఉంటుంది. ప్రతిరోజు పరిస్థితులను సమీక్షించేందుకు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్సు కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం. నిర్వహణలో జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకుంటారు.
విద్యార్థులు తరగతులకు హాజరవుతున్న సమయంలో వారి ఇళ్లలోని పరిస్థితులను ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, ఆరోగ్య సిబ్బంది ద్వారా తెలుసుకుంటాం. ఎవరిలోనైనా అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేసి, నివేదికల ఆధారంగా చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేస్తాం. వ్యాప్తి నివారణపై ప్రజల్లో అవగాహనకు ఈ నెలాఖరు వరకు కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లాలకు ఆదేశాలిచ్చాం. రాబోయే పది రోజుల్లో ఒక శాతం వైరస్ కేసులు తగ్గే అవకాశాలు ఉన్నాయి. సెప్టెంబరుతో పోల్చితే ప్రస్తుతం కేసులు బాగా తగ్గుముఖం పట్టాయి. కృష్ణా జిల్లాలో కేసుల పెరుగుదలపై అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం’ అని వివరించారు.
ఇదీ చదవండి