NIMS Hospital: మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సల్లో తెలంగాణలోని నిమ్స్ అరుదైన ఘనత సాధించింది. కొవిడ్ మహమ్మారి వెన్నాడుతున్న కాలంలో ఈ సంవత్సరం(2021) ఇప్పటికి నిమ్స్‌లో 101 మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఇందులో ఆరోగ్యశ్రీ పథకం కింద 97 శాతం ఆపరేషన్లు పూర్తి ఉచితంగా చేసినవే. మరోవైపు ఉస్మానియా ఆసుపత్రిలో ఈ ఏడాదిలో సుమారు 30 కిడ్నీమార్పిడి ఆపరేషన్లు చేయగా.. గాంధీలో ఒక్కటి కూడా నిర్వహించలేదు. ఇక వరంగల్ ఎంజీంఎం ఆసుపత్రిలో ఆ ఊసే లేదు. కిడ్నీ మార్పిడి చికిత్సల్లో నిమ్స్ అనుసరిస్తున్న విధానం.. ఇతర బోధనాసుపత్రులకు అనుసరణీయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిమ్స్‌లో నెఫ్రాలజీ, యూరాలజీ విభాగాలు పటిష్ఠంగా ఉన్నాయి. నెఫ్రాలజీ విభాగంలో 2 యూనిట్లున్నాయి. ఇద్దరు ఆచార్యులు సహా ఆరుగురు వైద్యనిపుణులున్నారు. 24 మంది పీజీ వైద్యుల సేవలు అందుబాటులో ఉంటాయి. అలాగే యూరాలజీలోనూ ఇద్దరు ఆచార్యులు సహా ఆరుగురు వైద్యులున్నారు. 12 మంది పీజీల సేవలూ లభిస్తున్నాయి. యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాల మధ్య సమన్వయం గత కొన్నేళ్లుగా కొనసాగుతోంది. దీంతో నిమ్స్‌లో 2016లో 111, 2017లో 114, 2018లో 111, 2019లో 107, 2021లో 101 శస్త్రచికిత్సలు జరిగాయి. 2020లో కరోనా నిబంధనల కారణంగా 26 మార్పిడి శస్త్రచికిత్సలు మాత్రమే చేయగలిగారు.
ఇతర ఆసుపత్రుల్లో ఎందుకు వైఫల్యం?
kidney transplant surgery NIMS: ఉస్మానియాలో కొన్నేళ్లుగా యూరాలజీ ఆచార్యుల పోస్టులు 2 ఖాళీగా ఉన్నాయి. అనుభవజ్ఞుడైన వైద్యుడు లేకుండా అత్యంత క్లిష్టమైన మార్పిడి శస్త్రచికిత్సలను నిర్వహించడానికి ఇతర వైద్యులు ముందుకు రావడంలేదు. ఇక్కడ 2 యూనిట్లలో 6 మంది నెఫ్రాలజిస్ట్‌లున్నారు. 9 మంది పీజీ వైద్యులు కూడా ఉన్నారు. అయినా ఇక్కడ ఏడాదికి 25-30కి మించి కావడం లేదు. జీవన్మృతుడిగా ప్రకటించడానికి ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ఇప్పటివరకూ అలాంటి కమిటీయే లేదు. దీంతో ఉస్మానియాలో ఎక్కువగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరగడం లేదని వైద్యవర్గాలు తెలిపాయి. ఇక గాంధీ ఆసుపత్రిలో కొవిడ్‌కు ముందు కూడా పెద్దగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరిగిన దాఖలాలు లేవు. ఇక్కడ 2018లో ఆ ఏడాది మొత్తమ్మీద 4 చేశారు. 2019లో మార్పిడులు చేయలేదు. 2020లో కొవిడ్ ఆసుపత్రిగా ఉండడంతో ఆ శస్త్రచికిత్సలు నిలిపివేశారు. 4 నెలలుగా అన్ని రకాలు చికిత్సలు చేస్తున్నా ఇప్పటివరకూ ఒక్క శస్త్రచికిత్స కూడా చేయలేదు.కిడ్నీ మార్పిడి చేయడానికి అవసరమైన యూరాలజీ ఆచార్యుడి పోస్టే ఖాళీగా ఉండటం ప్రధాన అవరోధంగా తెలుస్తోంది. ఎంజీఎం ఆసుపత్రిలో నెఫ్రాలజీ, యూరాలజీ విభాగాలను పటిష్ఠపర్చకపోవడం పెద్దలోటు.
అన్ని జాగ్రత్తలు తీసుకున్నాకే మార్పిడులు
మూత్రపిండాన్ని పొందే రోగి, దాత తప్పనిసరిగా రెండు డోసుల కొవిడ్ టీకా పొందేలా ముందే జాగ్రత్తలు తీసుకున్నాం. చికిత్సలో భాగస్తులయ్యే వైద్యులు, నర్సులు ఇతర సిబ్బంది కూడా వ్యాక్సినేషన్ చేయించుకున్నాం. జలుబు, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా అందరం కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నాం. సాధారణంగా శస్త్రచికిత్స తర్వాత ఒక నెలకు మందులు ఇచ్చి పంపిస్తుంటాం. కానీ కొవిడ్ సమయంలో పదే పదే బయటకు రావడం వల్ల వైరస్ బారినపడే అవకాశాలుంటాయి కాబట్టి.. మూడు నెలలకు ఒకేసారి మందులిచ్చే విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది.రోగులకు ఇది ఉపయోగంగా మారింది. చికిత్స సమయంలో స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యమిస్తాం.-- ఆచార్య డాక్టర్ టి.గంగాధర్, నెఫ్రాలజీ విభాగాధిపతి, నిమ్స్
సర్కారు అన్ని వసతులు కల్పిస్తోంది..
ప్రజారోగ్యంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత శ్రద్ధపెట్టారు. అన్ని బోధనాసుపత్రుల్లోనూ అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించేలా ప్రభుత్వం వసతులు కల్పిస్తోంది. వైద్యులు చొరవ తీసుకోవాలి. నిమ్స్ నుంచి స్ఫూర్తి పొందాలి. ప్రైవేటు ఆసుపత్రుల్లో కిడ్నీ మార్పిడికి సుమారు రూ.15-20 లక్షల వరకు ఖర్చవుతోంది. అదే ఆరోగ్యశ్రీ కింద 1.6 లక్షలు ప్రభుత్వం చెల్లిస్తోంది. దీంతో పాటు జీవితాంతం ఉచితంగా మందులను అందజేస్తోంది. ఈ విధానం దేశంలో మరే రాష్ట్రంలోనూ లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 49 ఉచిత డయాలసిస్ కేంద్రాల వల్ల కూడా కిడ్నీ వైఫల్య రోగులకు ఉపయోగంగా ఉంటోంది. ఆరోగ్య తెలంగాణ సాధించే దిశగా ముందుకు సాగుతాం.-- హరీశ్‌రావు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి
కొవిడ్‌లోనూ కిడ్నీ మార్పిడి సాధ్యమే..
కొవిడ్ సమయంలో శస్త్రచికిత్స చేయడం సవాల్‌తో కూడుకున్నది. అయిదారు గంటలపాటు పీపీఈ కిట్లు వేసుకోవడంతో చెమటతో దుస్తులు తడిసి ముద్దవుతాయి. ఈ సమయంలో మరింత జాగ్రత్తగా చికిత్స అందించాల్సి ఉంటుంది. ఈ ఏడాదిలో మేం చేసిన 101 మందిలో ఒక్కరికి కొవిడ్ వచ్చింది. అదృష్టవశాత్తు తను కోలుకున్నారు. 2020లో కొవిడ్ కాలంలో లాక్‌డౌన్ ఉండడం, ప్రొటోకాల్ తెలియకపోవడంతో ఆపేశాం. జీవించి ఉన్న వారి నుంచి మార్పిడి చేయాల్సి వచ్చినప్పుడు.. ఇద్దరికి ఒకేసారి శస్త్రచికిత్స చేయాల్సి వస్తుంది. రెండు బృందాలు దీనిపై పనిచేస్తుంటాయి. కొవిడ్ సమయంలో మార్పిడి చేయడం వల్ల రోగికి ఎలాంటి ముప్పు లేదు. యూరాలజీకి సంబంధించి ఇతర శస్త్రచికిత్సలు కూడా ఏటా సుమారు 6500 వరకూ చేస్తుంటాం.
- ఆచార్య డాక్టర్ రామిరెడ్డి, యూరాలజీ విభాగాధిపతి, నిమ్స్.
- ఆచార్య డాక్టర్ రాహుల్ దేవరాజ్, మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స నిపుణులు, నిమ్స్
- ఇవీ చూడండి: prc: ఉద్యోగుల ఉద్యమానికి తాత్కాలిక విరామం