రాష్ట్రంలోని పెద్దాసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణాన్ని భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఆరంభించింది. మొత్తం 42 ప్లాంట్లు నిర్మిస్తారు. ఒక్కో ప్లాంట్ నిర్మాణ పనులను(సివిల్, ఎలక్ట్రికల్) 10 నుంచి 14 రోజుల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. ఆక్సిజన్ ప్లాంట్లు అవసరమైన సూపర్ స్పెషాలిటీ, జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రులను కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఎంపిక చేశాయి. ఇందులో 50 పడకలు నుంచి అత్యధికంగా 822 పడకలు ఉండే ఆసుపత్రులు ఉన్నాయి. వీటిలో ఆయా పడకల సంఖ్య ఆధారంగా 200 లీటర్స్ పర్ మినిట్ (ఎల్‌పీఎం) నుంచి 2,500 ఎల్‌పీఎం సామర్థ్యం గల ప్లాంట్లు నిర్మించాలని ఎన్‌హెచ్‌ఏఐకి ఆదేశాలు ఇచ్చారు. తొలుత పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, అనంతపురం జిల్లా హిందూపురంలో 1,000 ఎల్‌పీఎం, తూర్పుగోదావరి జిల్లా అమలాపురం, చిత్తూరు జిల్లా మదనపల్లి ఆసుపత్రిలో 500 ఎల్‌పీఎం సామర్థ్యంతో ప్లాంట్ల నిర్మాణం చేపట్టారు. ఈ వారంలో మిగిలిన 38 ఆసుపత్రుల్లో పనులు ఆరంభించే అవకాశం ఉందని పేర్కొన్నారు. సివిల్, ఎలక్ట్రికల్ పనులు పూర్తి చేసి 21 ప్లాంట్లను డీఆర్‌డీవోకు, మరో 21 ప్లాంట్లను హెచ్‌ఎల్‌ఎల్ ఇన్‌ఫ్రాటెక్ సర్వీసెస్ లిమిటెడ్ (హైట్స్)కు అప్పగించనున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు తెలిపారు.
ప్లాంట్లు నిర్మించే ఆసుపత్రులు ఇవే..
* విజయవాడ జీజీహెచ్‌లో 2,500 ఎల్‌పీఎం, కడప జీజీహెచ్‌లో 2,000 ఎల్‌పీఎం సామర్థ్యంగల ప్లాంట్లు నిర్మించనున్నారు.
* శ్రీకాకుళంలోని టెక్కలి, పాలకొండ, విజయనగరం జిల్లాలోని విజయనగరం, పార్వతీపురం, విశాఖలోని అనకాపల్లి, పాడేరు, విశాఖపట్నం ప్రభుత్వ ఆసుపత్రి, ఛాతి ఆసుపత్రి, తూర్పుగోదావరిలోని రాజమహేంద్రవరం, పశ్చిమగోదావరిలోని ఏలూరు, తణుకు, జంగారెడ్డిగూడెం, కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, గుడివాడ, నూజివీడు, గుంటూరులోని ఫీవర్ ఆసుపత్రి, బాపట్ల, తెనాలి, నర్సరావుపేట, కడప జిల్లాలో ప్రొద్దుటూరు, పులివెందుల, కర్నూలులోని నంద్యాల, అనంతపురంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, కదిరి, గుంతకల్ ఆసుపత్రుల్లో 1,000 ఎల్‌పీఎం ప్లాంట్లు నిర్మించనున్నారు.
* చిత్తూరు జిల్లాలోని తిరుపతి బర్డ్స్, నగరి, ప్రకాశంలోని మార్కాపురం, కర్నూలులోని ఆదోనిఆసుపత్రుల్లో 500 ఎల్‌పీఎం సామర్థ్యంగల ప్లాంట్లు నిర్మిస్తారు.
* శ్రీకాకుళం జిల్లా రాజాం, విశాఖలో అరకు, నర్సీపట్నం, తూర్పుగోదావరిలో రామచంద్రాపురం, ప్రకాశంలో చీరాల, చిత్తూరులో తిరుపతి ఈఎస్‌ఐ ఆసుపత్రి, పలమనేరు ఆసుపత్రుల్లో 200 ఎల్‌పీఎం ప్లాంట్లు నిర్మించనున్నారు.
ఇదీ చదవండి: 'రుయా ఘటనపై న్యాయవిచారణ జరిపించాలి'