రాష్ట్రంలో నూతన సంవత్సర వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. కొవిడ్ నిబంధనల కారణంగా ప్రజలు ఇళ్ల వద్దనే వేడుకలు నిర్వహించుకున్నారు.
శ్రీకాకుళం జిల్లా ...
నిరాడంబరంగా నూతన సంవత్సర వేడుకలను మంత్రి సీదిరి అప్పలరాజు కుటుంబ సమేతంగా జరుపుకున్నారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలంలోని గిరిజన గ్రామం పాతకోటలో నూతన సంవత్సర వేడుకలను జరుపుకొని.. అక్కడే బస చేశారు. గిరిజన సంప్రదాయాలతో మంత్రి సీదిరి అప్పలరాజు కుటుంబసభ్యులకు అక్కడి ప్రజలు స్వాగతం పలికారు
కర్నూలు..
నూతన సంవత్సర వేడుకలను కర్నూలులో ప్రజలు ప్రశాంతంగా జరుపుకున్నారు. కొత్త ఏడాది ఇంటి వద్దే జరుపుకోవాలని పోలీసులు తెలపడంతో ప్రజలు రోడ్డుపైకి రాలేదు. ప్రతి సంవత్సరం నూతన సంవత్సర వేడుకలను నగరంలోని రాజ్ విహర్ కూడలి వద్ద యువత పెద్ద సంఖ్యలో వచ్చి బాణా సంచా కాల్చి సంబరాలు జరుపుకునే వారు. ప్రస్తుతం కరోనా నిబంధనలు అమలు అవుతున్నందున యువకులు ఎవరూ రాత్రి బయటికి రాలేదు. ప్రజలు పోలీసులకు సహకరించినందుకు నగర డీఎస్పీ కేవీ.మహేష్ కృతజ్ఞతలు తెలిపారు.
అనంతపురం...
అనంతపురంలో కొత్త సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరిగాయి. కొవిడ్ కారణంగా కొత్త సంవత్సర వేడుకలను జిల్లా యంత్రాంగం రద్దుచేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. జిల్లాలో 30 యాక్ట్ అమలు పరిచేలా కఠిన చర్యలు తీసుకున్నారు. దుకాణాలకు 10 గంటల వరకు అనుమతి ఇచ్చిన అధికారులు పది తర్వాత రోడ్ల మీదికి ప్రజలను రానివ్వకుండా హెచ్చరించారు. 12 గంటల తర్వాత పోలీసులు టవర్ క్లాక్ వద్ద కేక్ కట్ చేసి ప్రశాంతంగా సంబరాలు చేసుకున్నారు. జిల్లా యంత్రాంగం సూచనలను పాటించి నందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇదీ చదవండీ...కొత్త ఆశయాలు, ఆశలతో నూతన సంవత్సరానికి స్వాగతం