మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ మృతి చెందినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ ధ్రువీకరించారు. కరోనాతో బాధపడుతూ.. చివరకు గుండెపోటుతో మరణించారని తెలిపారు. మరికొందరికి వైరస్ సోకిందని వెల్లడించారు. మావోయిస్టులు పోలీసులను సంప్రదించాలని సూచించారు. మెరుగైన వైద్యం అందించి వారి ప్రాణాలను కాపాడుతామని హామీ ఇచ్చారు.
సామాజిక మాధ్యమాల్లో ప్రచారం
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ అలియాస్ హెచ్‌బీ అలియాస్ లక్మాదాదా ఆరోగ్య పరిస్థితిపై మంగళవారం కలకలం రేగింది. తీవ్ర అస్వస్థతతో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించి సోమవారం రాత్రి మృతిచెందారనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో గుప్పుమన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని మీనగట్ట ప్రాంతంలో ఆయన మృతిచెందినట్లు దంతేవాడ పోలీసు ఉన్నతాధికారి ఒకరు ధ్రువీకరించారంటూ బస్తర్ ప్రాంతానికి చెందిన మీడియా సంస్థ ట్విటర్‌లో పేర్కొంది.
మడగూడ నుంచి కేంద్ర కమిటీకి..
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం మడగూడకు చెందిన యాప నారాయణ పదో తరగతి వరకు చదువుకొని విప్లవ కార్యకలాపాల వైపు ఆకర్షితుడయ్యారు. గుత్తికోయ సామాజిక వర్గానికి చెందిన నారాయణ దండకారణ్యానికి బదిలీ అయ్యాక అంచెలంచెలుగా ఎదిగారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా నియమితులై కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న మార్గదర్శకత్వంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా.. కొంతకాలం క్రితం హరిభూషణ్‌ను మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలోకి తీసుకున్నారు.
కరోనాతో హరిభూషణ్ చనిపోయినట్లు జరుగుతున్న ప్రచారం తమను క్షోభపెడుతోందని ఆయన చిన్న తమ్ముడు అశోక్ పేర్కొన్నారు. దీనిపై కుటుంబ సభ్యులు క్లారిటీ ఇవ్వాలని కోరగా... హరిభూషణ్ మృతిని ఎస్పీ ధ్రువీకరించారు.
ఇదీ చదవండి:
Chandrababu: దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నా.. ప్రతిపక్షాలపై అక్రమ కేసులు తగ్గట్లేదు