అడవులు పచ్చగుంటేనే మనం పచ్చగుంటామని ఇప్పటికీ చాలా మంది గుర్తించలేదు. అడవులు నిర్దాక్షిణ్యంగా నరికి వేస్తున్నారు. నానాటికి అడవులు తగ్గిపోతున్నాయి. ఫలితంగా కాలుష్యం పెరుగుదల, వర్షాలు లేకపోవడం జరుగుతోంది. ఇది ఇలానే కొనసాగితే భవిష్యత్ తరాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. గమనించిన తెలంగాణ ప్రభుత్వం హరితహారంతో అడవులను పెంచే బృహత్తర కార్యక్రమానికి గతంలోనే శ్రీకారం చుట్టింది.
మొక్కలంటే అమితాసక్తి
తెలంగాణ ప్రభుత్వ ఆశయాన్ని మూడేళ్ల క్రితమే అమలు చేసి...అడవుల పునరుద్ధరణ చేపట్టారు ఆ రాష్ట్రంలోని జనగామకు చెందిన శ్రీనివాసరెడ్డి దంపతులు. శ్రీనివాసరెడ్డికి చిన్ననాటి నుంచే మొక్కలంటే అమితాసక్తి. సిద్ధంకిలో తనకున్న వ్యవసాయ భూమిలో పదెకరాల్లో వేప... మొక్కలు పెంచి... వేపవనం తయారు చేశారు. ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా ఐదు వేల వేప వృక్షాలతో చిన్నపాటి అడవిని సృష్టించారు.
సొంత బిడ్డల్లా....
మొదట్లో పశువులు, మేకలతో శ్రీనివాసరెడ్డి దంపతులు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నా... వెనకడుగు వేయలేదు. ఎప్పటికప్పుడు మొక్కలను సొంత బిడ్డల్లా చూసుకుని పెంచుకున్నారు. ఈదురు గాలులకు పడిపోయిన మొక్కలను తీసి కొత్తవి నాటారు. వృక్ష సంపద సమృద్ధగా ఉంటే వర్షాలుంటాయని... అందుకే చెట్లు పెంచానని శ్రీనివాసరెడ్డి దంపతులు అంటున్నారు. సంకల్పం ఉండాలే కానీ... ఎంతటి లక్ష్యమైనా సాధించవచ్చనడానికి ఆహ్లాదకరమైన వనాన్ని పెంచిన ఈ దంపతులు నిదర్శనంగా నిలిచారు.
ఇదీ చూడండి: