National Water Development Corporation Meeting: గోదావరి- కావేరి నదుల అనుసంధానంలో రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ ప్రధాన సమస్యగా మారిందని జాతీయ జల అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) పేర్కొంది. అదేకాక గోదావరి, కృష్ణా, కావేరి ట్రైబ్యునళ్ల అవార్డులను పరిగణనలోకి తీసుకొని రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించడం కీలకమంది. దీంతోపాటు నదుల అనుసంధానం, ఇతర అంశాలపై చర్చించేందుకు ఎన్.డబ్ల్యు.డి.ఎ. ఈ నెల 19న సమావేశం కానుంది. కేంద్రజల్‌శక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ భేటీలో అన్ని రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొంటారు.
సమావేశంలో చర్చించనున్న 4 కీలక ప్రాజెక్టులు..
- ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్‌లకు ఉపయోగపడే కెన్-బెట్వా అనుసంధానం ప్రాజెక్టు అమలు
- మహారాష్ట్ర-గుజరాత్‌లకు ప్రయోజనం కలిగే దామన్‌గంగా-పింజల్-పార్-తాపి-నర్మద అనుసంధానం
- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులకు నీరందించే గోదావరి(ఇచ్చంపల్లి)-కావేరి(గ్రాండ్ ఆనకట్ట) అనుసంధానం
- బిహార్‌కు మాత్రమే ఉపయోగపడే కోసి-మెచి ప్రాజెక్టు
రాష్ట్రాల అభ్యంతరాలు...
- ఇచ్చంపల్లి వద్ద బ్యారేజి నిర్మించి 247 టీఎంసీల నీటిని మళ్లించి మూడు రాష్ట్రాల్లో ఆయకట్టుకు, చెన్నై తాగునీటి అవసరాలను తీర్చే గోదావరి-కావేరి అనుసంధానంపై ఛత్తీస్‌గఢ్, కర్ణాటకతో పాటు కేరళ, పాండిచ్చేరి, మహారాష్ట్రలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి.
- ఇంద్రావతిలో ఛత్తీస్‌గఢ్‌కు కేటాయించి వినియోగించుకోని నీటిని మళ్లించేలా మొదట ప్రతిపాదించగా, ప్రస్తుతం దీనికి ఆ రాష్ట్రం అంగీకరించడం లేదు. మరోవంక.. నీటి లభ్యతపై మొదట అధ్యయనం చేయాలని తెలంగాణ కోరుతోంది. కావేరికి మళ్లించే నీటిలో తమకూ వాటా ఇవ్వాలని కర్ణాటక డిమాండు చేస్తోంది.
ఇదీ చూడండి: PRC ORDERS: ఉద్యోగులకు జగన్ సర్కార్ షాక్.. డిమాండ్లు బేఖాతరు!