JEE Mains 2022 : జేఈఈ మెయిన్స్‌ను ఈసారి గతంలో మాదిరే రెండు విడతలే నిర్వహించేందుకు జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చింది. దీనిపై మరి కొద్దిరోజుల్లో స్పష్టత ఇస్తూ నోటిఫికేషన్ జారీ చేయనుందని సమాచారం. ఎన్‌ఐటీల్లో ప్రవేశానికి, జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసే అర్హులను నిర్ణయించేందుకు ఎన్‌టీఏ ఏటా జేఈఈ మెయిన్ పరీక్షలు జరుపుతోంది. వాటిని 2019, 2020లో ఆన్‌లైన్ విధానంలో రెండు విడతలుగా.. 2021లో కరోనా రెండోదశ కారణంగా విద్యార్థుల సౌలభ్యం కోసం నాలుగు విడతలుగా నిర్వహించారు.
రెండు సార్లు చాలు..
JEE Mains 2022 in Two Phases : వచ్చే విద్యా సంవత్సరం(2022-23)లో ప్రవేశాల కోసం ఈసారి తొలివిడతను ఫిబ్రవరిలో జరపాల్సి ఉంది.. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఫిబ్రవరికి బదులు మార్చిలో నిర్వహించాలని తొలుత భావించారు. తర్వాత నెలకో విడత చొప్పున ఏప్రిల్, మే, జూన్‌లో జరపాలని ఎన్‌టీఏ వర్గాలు నిర్ణయానికి వచ్చాయి. కరోనా ప్రభావం తగ్గి సాధారణ పరిస్థితి నెలకొనటం, ప్రత్యక్ష తరగతులూ జరుగుతున్నందున ఈసారి రెండుసార్లు నిర్వహిస్తే చాలని ఎన్‌టీఏ తాజాగా నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. లేకుంటే వచ్చే విద్యా సంవత్సర (2022-23) ప్రారంభమూ ఆలస్యం అవుతుందన్న భావనతో కేంద్రం ఉంది. అందుకే వచ్చే కొద్దిరోజుల్లో నోటిఫికేషన్ జారీచేసి ఏప్రిల్‌లో మొదటి విడత పరీక్ష జరిపే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. చివరి విడతలను మే నెలాఖరులో నిర్వహించాలని భావిస్తున్నారు. మరోవైపు ఎంబీబీఎస్‌లో ప్రవేశాల కోసం నీట్‌ను జూన్ నెలాఖరు లేదా జులై మొదటి వారంలో జరపాలని కేంద్ర విద్యా, వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
విద్యార్థులకు ఒత్తిడి..
JEE Mains Exam 2022 : సీబీఎస్‌ఈతో పాటు పలు రాష్ట్రాల బోర్డులు 12వ తరగతి పరీక్షలను ఏప్రిల్‌లోనే జరుపుతున్నాయి. ఏపీలో ఏప్రిల్ 8, తెలంగాణలో ఏప్రిల్ 20, సీబీఎస్‌ఈవి 26 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే కాలపట్టికలనూ ప్రకటించాయి. అందువల్ల జేఈఈ మెయిన్ కూడా ఏప్రిల్‌లో జరిగితే విద్యార్థులు ఒత్తిడికి గురవుతారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
గతేడాది 4సార్లు రాసింది 27 శాతం మందే
National Testing Agency : దేశవ్యాప్తంగా గత ఏడాది జేఈఈ మెయిన్ 4 విడతలకు 10.48 లక్షల మంది దరఖాస్తు చేశారు. వారిలో 9.39 లక్షల మంది పరీక్షలు రాశారు. 4సార్లు పరీక్షలు రాసినవారు 2.52,954 మంది ఉన్నారు. అది 27 శాతంతో సమానం. చివరి విడతకు అత్యధికంగా 7.67 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నా అతి తక్కువగా 4.81 లక్షల మందే పరీక్ష రాయటం గమనార్హం. తెలుగు రాష్ట్రాల కోసం జేఈఈ మెయిన్‌కు దాదాపు లక్షన్నర మంది హాజరవుతారు.