పోలవరం నిర్వాసితులకు పరిహారం ఎందుకు ఇవ్వడం లేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన.. కూనవరం మండల పరిధిలో ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్వాసితులతో మాట్లాడారు. 2019లో వరదలు వచ్చినప్పుడు నిర్వాసితులను ప్రభుత్వం కనీసం ఆదుకోలేదని దుయ్యబట్టారు. "రూ.2,500 సాయం చేయలేని వైకాపా సర్కార్.. రూ.10 లక్షలు ఎలా ఇస్తుంది?" అని వ్యాఖ్యానించారు.
నిర్వాసితులకు మొత్తం ఇళ్లు కట్టిస్తామని చెప్పి.. ఇప్పటివరకు ఒక్కటీ కట్టలేదని ఆరోపించారు. ఈ ఏడాది జులై నాటికి పోలవరం పూర్తి అవుతుందని చెప్పారని.. కానీ ఈ రెండున్నర ఏళ్లలో కేవలం రూ.850 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయో చెప్పాలని? ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చంద్రబాబు పోరాటం వల్లే విలీన మండలాలు ఏపీలో కలిశాయని గుర్తు చేశారు. గిరిజనులపై అట్రాసిటీ కేసులు పెట్టిన ఘనత జగన్ ప్రభుత్వానిదేనని ధ్వజమెత్తారు.
'పోలవరం నిర్మాణం వెనుక లక్షా 90 వేల మంది ప్రజల త్యాగం ఉంది. పోలవరం నిర్వాసితులను వైకాపా ప్రభుత్వం విస్మరించింది. నిర్వాసితులకు రూ. 10 లక్షలు ఇస్తామన్న హామీ ఏమైంది? పోలవరం నిర్వాసితులకు ఇళ్లు కట్టి ఎప్పుడిస్తారో చెప్పాలి? బినామీల పేరుతో వైకాపా నేతలు రూ.550 కోట్లు కాజేశారు. నిధుల మాయంపై సీబీఐ విచారణకు ఆదేశించే ధైర్యం ఉందా? చంద్రబాబు పోరాటం వల్లే విలీన మండలాలను ఏపీలో కలిపారు. పోలవరం నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పోరాడతాం. చంద్రబాబు ఆధ్వర్యంలోనే పోలవరం పూర్తవుతుంది' - నారా లోకేశ్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి
పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలని లోకేశ్ డిమాండ్ చేశారు. "2016లో జగన్ రెడ్డి నిర్వాసితులకు ఎకరానికి 19 లక్షలు ఇస్తామన్నారు. పాదయాత్ర సమయంలో 10 లక్షలు ఇస్తామన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక పరిహారం ఇవ్వలేదు. భూమి కూడా ఇవ్వలేదు. నిర్వాసితుల కోసం ఏం చేయలేదు. గాలి మాటలు చెబుతున్నారు. పోరాడితే కేసులు పెడుతున్నారు. గ్రామాల నుంచి వెళ్లగొడుతున్నారు. అధికారులకే జీతాలు ఇవ్వలేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది" అని లోకేశ్ ఎద్దేవా చేశారు. అంతకుమందు కూనవరం మండల పరిధిలోని కాచవరంలో గడేసుల హరనాథ్ అనే వ్యక్తి కుటుంబాన్ని లోకేశ్ పరామర్శించారు. ఆయనతో పర్యటనలో తెదేపా నేతలు దేవినేని ఉమ, చినరాజప్ప పాల్గొన్న రాజేశ్వరి, వెంకటేశ్వరరావు, జ్యోతుల నవీన్ పాల్గొన్నారు.
భదాద్రి సన్నిధిలో..
పోలవరం పర్యటనలో భాగాంగా లోకేశ్.. తొలుత తెలంగాణలోని భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయంలో వేద ఆశీర్వచనం అందించి శాలువాతో సత్కరించి స్వామివారి ప్రసాదాన్ని అందించారు. లోకేశ్‌తో పాటు భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, తెదేపా నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల సర్వం కోల్పోయిన నిర్వాసితులకు శక్తిని అందించాలని భద్రాద్రి రామయ్యను కోరుకున్నట్లు నారా లోకేశ్ తెలిపారు.
ఇదీ చదవండి:
Minister Gowtham Reddy: రాజధాని అనే పదం రాజ్యాంగంలోనే లేదు: మంత్రి గౌతంరెడ్డి