రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ.. చేతలు మాత్రం గడప కూడా దాటడం లేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా రోగి బాత్ రూంలో పడి చనిపోయిన ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. కరోనాను ఎదుర్కోవడం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో ఈ ఒక్క సంఘటన ద్వారా తెలుస్తుందని మండిపడ్డారు.
క్వారంటైన్ సెంటర్లలో వసతులు శూన్యమని.. ఆస్పత్రుల్లో సరైన వైద్యం కూడా అందడం లేదని లోకేశ్ ఆరోపించారు. నిరంతరం కరోనాపై పోరాడుతున్న వైద్య సిబ్బంది రోడ్లపైకి వచ్చి నాణ్యమైన పీపీఈ కిట్లు ఇవ్వాలంటూ ఆందోళన చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రికి కరోనా పెద్ద విషయం కాకపోవచ్చని.. కానీ ప్రజల ప్రాణాలు విలువైనవని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా వీడియో విడుదల చేశారు.
ఇదీ చూడండి..