విజయనగరం జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మతల్లి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. ఆలయంలో పుట్టపై కొలువైన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. నెల్లిమర్లలో నాగుల చవితి వేడుకలు వైభవంగా జరిగాయి. విశాఖ జిల్లా చోడవరంలో నాగుల చవితి వేడుకగా నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో నాగుల చవితి వేడుకలను భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కొత్తపేట నియోజక వర్గం లోని రావులపాలెం ఆత్రేయపురం ఆలమూరు కొత్తపేట మండలాల్లో భక్తులు తెల్లవారుఝామునుంచే పూజలు చేశారు.
తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో గ్రామ గ్రామాన నాగేంద్రుని భక్తిశ్రద్ధలతో భక్తులు కొలిచారు. అంబాజీపేట, అయినవిల్లి, ముక్కామల, నగరం, ముంగండ, నరేంద్రపురం, పుల్లేటికుర్రు, వీరవల్లిపాలెం తదితర గ్రామాల్లో వందల సంఖ్యలో భక్తులు పుట్టలో పాలు పోసి నాగేంద్రుని పూజించారు. పశ్చిమ గోదావరిజిల్లా తణుకు, ఉండ్రాజవరం పరిసర ప్రాంతాల్లో నాగులచవితి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. ఉండ్రాజవరంలో స్వామి దర్శనానికి సుమారు అర కిలో మీటరు పైగా బారులు తీరారు.
కృష్ణా జిల్లా మోపిదేవిలో నాగులచవితి సందర్భంగా భక్తులు దేవాలయానికి పోటెత్తారు. శ్రీ వల్లీ, దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో పూజలు చేశారు. జగ్గయ్యపేట పరిధిలోని ముక్త్యాల, వేదాద్రి, తిరుమలాగిరి, శ్రీగురుదాం క్షేత్రాల్లోని పుట్టల వద్ద పెద్ద సంఖ్యలో భక్తులు పూజలు చేశారు. నందిగామ పట్టణంలోని రైతుపేటడౌన్ లో భక్తులు పుట్టలో పాలు పోశారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం రాళ్లవాగు పుట్టకు భక్తులు ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో తరలి పూజలు చేశారు.