తెలంగాణలో మరో ఆసక్తికర రాజకీయ పోరుకు తెరలేచింది. నాగార్జునసాగర్ శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక తేదీ ఖరారు కావడంతో ప్రధాన పార్టీలు కార్యాచరణకు శ్రీకారం చుట్టాయి. శాసనమండలి ఎన్నికల పోలింగ్ ముగిసిన రెండు రోజుల్లోనే సాగర్ పోరుకు రంగం సిద్ధమైంది. ఉప ఎన్నికకు సరిగ్గా నెల రోజులే ఉండటం, ఈ నెల 30వ తేదీలోపు నామినేషన్ల ప్రక్రియ ముగియనుండటంతో అన్ని పార్టీలూ అభ్యర్థుల ఎంపిక కసరత్తును వేగవంతం చేశాయి. ఎన్నికల షెడ్యూలు విడుదలైన వెంటనే సీనియర్ నాయకుడు కె.జానారెడ్డిని కాంగ్రెస్ తమ అభ్యర్థిగా ప్రకటించింది.
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ముకుల్‌వాస్నిక్ ఒక ప్రకటనలో తెలిపారు. జానారెడ్డి ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించారు. మూడు, నాలుగు రోజుల్లో మిగిలిన పార్టీల అభ్యర్థులనూ ప్రకటించే అవకాశం ఉంది. నాగార్జునసాగర్ శాసనసభ్యుడు నోముల నర్సింహయ్య (తెరాస) గత ఏడాది డిసెంబరు 1న మృతి చెందడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. సిటింగ్ స్థానం కావడంతో తెరాసకు ఈ ఎన్నిక ప్రతిష్ఠాత్మకం కానుంది. దుబ్బాక గెలుపు నేపథ్యంలో భాజపా సాగర్‌లోనూ గెలవాలన్న పట్టుదలతో ఉంది.
ఆచితూచి భాజపా
తెరాస, కాంగ్రెస్ అభ్యర్థులకు సమ ఉజ్జీని బరిలో దింపుతామని భాజపా ముఖ్యనాయకుడొకరు తెలిపారు. అయిదుగురు ఆశావహులు టికెట్ కోసం భాజపా నాయకత్వాన్ని సంప్రదించారు. ఉప ఎన్నికకు ఇన్‌ఛార్జులుగా సంకినేని వెంకటేశ్వరావు, చాడ సురేష్‌రెడ్డిలను ఆ పార్టీ నియమించింది. శ్రేణుల్ని కూడా సమాయత్తం చేశారు. తెరాస అభ్యర్థిని ఖరారు చేసిన తర్వాతే తమ అభ్యర్థిని ప్రకటించే వ్యూహంతో భాజపా ఉంది.
సీపీఎం, సీపీఎంలు ఉమ్మడి అభ్యర్థిని నిలపాలా? ఇతర అభ్యర్థికి మద్దతు ఇవ్వాలా? అనే అంశంపై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నాయి. తెదేపా అరుణ్‌కుమార్‌ను ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించింది.
అభ్యర్థిత్వాలపై తెరాస కసరత్తు
తెరాస ఇప్పటికే కొంత మంది అభ్యర్థిత్వాలపై కసరత్తు చేసింది. నోముల నర్సింహయ్య కుటుంబ సభ్యులతో పాటు సామాజిక వర్గాల ప్రాతిపదికగా పలువురి పేర్లను పరిశీలిస్తోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై స్థానిక నేతల అభిప్రాయాలను సేకరిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సాగర్ నియోజకవర్గంలో ఇప్పటికే బహిరంగసభ నిర్వహించారు.
ఇదీ చదవండి: