చంపేస్తామన్నారు.. నామినేషన్లు చించేశారు
ప్రకాశం జిల్లాలో ప్రత్యర్థుల బెదిరింపుల కారణంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో నామినేషన్లు వేయలేకపోయిన, వేశాక వెనక్కి తీసుకున్న పదిమంది తాము చేసిన ఫిర్యాదుపై రశీదు ఇవ్వనందుకు జడ్పీ సీఈవో కైలాసగిరీశ్వర్ కారును అడ్డుకొని నిరసనకు దిగారు. సంతనూతలపాడు, నాగులుప్పలపాడు, కనిగిరి, మార్కాపురం మండలాలకు చెందిన వీరంతా తొలుత కలెక్టరేట్‌కు వెళ్లారు. కలెక్టర్ వీడియో సమావేశంలో ఉన్నందున సిబ్బంది సూచనపై జడ్పీ కార్యాలయంలో సీఈవోను కలిశారు. ఫిర్యాదులపై సీఈవో రశీదు ఇవ్వనందుకు ఆందోళన చేపట్టారు. కార్యాలయం ఆవరణలో, గేటు బయట ఆయన కారును అడ్డుకున్నారు.
ప్రత్యర్థులు బెదిరించి భయపెట్టారని గుంటూరు జిల్లాలో 81 మంది నుంచి ఫిర్యాదులొచ్చాయి. జడ్పీటీసీ, ఎంపీటీసీలకు సంబంధించి 70, పురపాలక ఎన్నికలపై మరో 11 ఫిర్యాదులు అధికారులకు అందాయి. గుంటూరు జిల్లా శావల్యాపురం మండలానికి చెందిన డి.సీతమ్మ, తిరుపతమ్మ, సుబ్బాయమ్మ, జి.శ్రీనివాస్, రామ్‌సింగ్‌నాయక్ తమను అధికార పార్టీ నాయకులు ఇబ్బంది పెట్టినట్లు ఆధారాలతో ఫిర్యాదు చేశారని తెలిపారు. పిడుగురాళ్ల పురపాలక పరిధిలో వార్డు స్థానాలకు సంబంధించి ప్రత్యర్థులు తమతో బలవంతంగా నామినేషన్లు ఉపసంహరింపజేశారని అధికారుల ముందు పలువురు వాపోయారు.
ప్రత్యర్థులు భయపెట్టడంతో జడ్పీటీసీ స్థానానికి వేసిన నామినేషన్లు ఉపసంహరించుకున్నామని చిత్తూరు జిల్లా చినగొట్టిగల్లు, రామచంద్రపురం, కార్వేటినగరం, పూతలపట్టు, కురబలకోట మండలాలకు చెందిన పలువురు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. తమను ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు వేయనివ్వలేదని 31 మంది అధికారులను కలిసి వివరించారు. మరో అవకాశం కల్పిస్తే నామినేషన్లు వేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
నెల్లూరు జిల్లా పొదలకూరు, కలువాయి, ఉదయగిరి, డక్కిలి, సీతారాంపురం, కావలి మండలాలకు చెందిన 36 మంది అధికారులను కలిసి.. తమను ఎంపీటీసీగా నామినేషన్లు వేయకుండా ప్రత్యర్థులు భయపెట్టారని ఫిర్యాదుచేశారు. ప్రత్యర్థులు తనపై పోలీసు కేసులు పెడతామని బెదిరించి బలవంతంగా నామినేషన్ ఉపసంహరించుకునేలా చేశారని సీతారాంపురం జడ్పీటీసీ అభ్యర్థి జి.చంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
కడప జిల్లాలో వందమందికి పైగా కలెక్టర్‌ని కలిసి ఫిర్యాదులు చేశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు వేసిన నామినేషన్లు ఉపసంహరించుకునేలా అధికార పార్టీ నాయకులు భయపెట్టారని ఆరోపించారు. ప్రత్యక్ష దాడులకు సైతం దిగారని ఇంకొందరు ఆవేదన వ్యక్తం చేశారు. మరోసారి నామినేషన్ వేసే అవకాశం కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు.
ప్రత్యర్థులు బెదిరించడంతో ఎంపీటీసీ స్థానాలకు వేసిన నామినేషన్లు వెనక్కి తీసుకున్నామని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 32 మంది ఫిర్యాదుచేశారు. నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని మరో 89 మంది అధికారుల ముందు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎంటీటీసీ స్థానాలకు వేసిన నామినేషన్లు వెనక్కి తీసుకునేవరకూ అధికార పార్టీ నేతలు భయపెట్టారని విశాఖపట్నం జిల్లా బుచ్చియ్యపేట, మాడుగుల, కె.కోటపాడు, అనకాపల్లి మండలాలకు చెందిన 14 మంది ఫిర్యాదు చేశారు. నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని మరో 18 మంది అధికారులను కలిసి ఫిర్యాదులు అందించారు.
ప్రత్యర్థుల బెదిరింపులతో ఎంపీటీసీ స్థానాలకు వేసిన నామినేషన్లు ఉపసంహరించుకున్నామని శ్రీకాకుళం జిల్లాకి చెందిన 72 మంది కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
* అనంతపురం జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు వేయకుండా ప్రత్యర్థులు అడ్డుకున్నారని 55 మంది ఫిర్యాదు చేశారు.
‘నామినేషన్ ఉపసంహరించుకోకపోతే నాతోపాటు నా భర్తను, మా కుటుంబసభ్యులను చంపుతానని వైకాపా నేత ఒకరు బెదిరించారు. ప్రాణభయంతో నామినేషన్ ఉపసంహరించుకున్నా. అవకాశం కల్పిస్తే మరోసారి నామినేషన్ వేస్తా. వైకాపా నేతల నుంచి మా ప్రాణాలకు రక్షణ కల్పించాలి.’ - కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు ఎంపీటీసీ-1కి నామినేషన్ వేసి వెనక్కి తీసుకున్న గంటా పార్వతి
‘పులివెందుల నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. నేను ఎంపీటీసీ అభ్యర్థిగా నామపత్రం దాఖలు చేశాను. సరైన వివరాలు లేవంటూ తిరస్కరించారు. నాపై తప్పుడు కేసు నమోదు చేయించి రిమాండ్‌కు పంపారు. 14 రోజులపాటు కడప సెంట్రల్ జైలులో ఉన్నాను. అధికారులు, పోలీసులే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు.’ - కడప జిల్లా నల్లపురెడ్డిపల్లె-1 ఎంపీటీసీ అభ్యర్థి పార్థసారథిరెడ్డి
‘బ్రహ్మంగారిమఠం జడ్పీటీసీ స్థానానికి తెదేపా అభ్యర్థిగా నామపత్రాలు దాఖలు చేసేందుకు వెళుతుంటే వైకాపా నాయకులు దాడిచేసి నామపత్రాలు చించేశారు. ఈ విషయమై గత మార్చిలో స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ఇప్పటికైనా నాకు అవకాశం కల్పిస్తే పోటీ చేస్తా.’- బ్రహ్మంగారిమఠం నాయకుడు బసిరెడ్డి దుగ్గిరెడ్డి
ఇదీ చదవండి: ఎంపీలకు 22 ప్రాంతీయ భాషల్లో ఉపరాష్ట్రపతి లేఖ