అఖిల భారత సర్వీసు అధికారులపై కొనసాగుతున్న ముఖ్యమంత్రి పేషీ వేధింపుల అడ్డుకోవాలని వైకాపా ఎంపీ రఘురామకృష్ణ రాజు కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబాను కోరారు. ఈ మేరకు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలనా నియమాలను గాలికి వదిలేయడంతో.. అరాచక పరిస్థితులు నెలకొన్నాయని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో సివిల్ సర్వీసు అధికారులు ముఖ్యమంత్రి ఆదేశాలను అమలు చేయడం మినహా.. ఏ ఒక్క పనీ చేయడం లేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాన్ని సంతృప్తి పర్చేందుకు ఏకపక్షంగా పని చేస్తున్నారని తెలిపారు.
ప్రధానమంత్రి ఈ నెల నాలుగో తేదీన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు హాజరయ్యారని, ప్రొటోకాల్ ప్రకారం తాను హాజరుకావల్సి ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం పలు అడ్డంకులు సృష్టించిందని రాజీవ్ గౌబా దృష్టికి తీసుకెళ్లారు. తన ఫోన్ కాల్‌కు సమాధానమిచ్చినందుకు.. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతిని సీఎం కార్యాలయానికి పిలిపించి బెదిరించారని రఘురామ ఆరోపించారు. సీఎం కార్యాలయం నుంచి ఇటువంటి బెదిరింపులను నిరోధించకపోతే.. బ్యూరోక్రసీ పూర్తిగా అచేతనమయ్యే ప్రమాదం ఉందని లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.
43 వేల కోట్ల రూపాయల అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై 32 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, పదేళ్లుగా ఆయన కోర్టులకు వెళ్లకుండా హాజరు మినహాయింపు పొందుతున్నారని, ఆ విషయాలు లేవనెత్తుతున్నందుకు తనపై రాజద్రోహం సహా ఇతర తప్పుడు కేసులు మోపారని రఘురామ తన లేఖలో వివరించారు. కస్టడీలో తనను చిత్రహింసలు పెట్టారని, సుప్రీంకోర్టు జోక్యంతో తాను బయటకు వచ్చినట్లు పేర్కొన్నారు. తన ఫ్లెక్సీలు పెట్టిన అనుచరులను వేధిస్తున్నారని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం దెబ్బతినడానికి ఉన్నత స్థాయిలో ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ పాత్ర ఉందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లోని పరిస్థితులపై విశ్వసనీయత గల అఖిల భారత సర్వీసు అధికారుల ద్వారా సమాచారం సేకరించాలని కోరారు. రాష్ట్రంలో అధికార వ్యవస్థను త్వరగా గాడిలో పెట్టకపోతే ప్రజలు పాలన వ్యవస్థపై విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.