వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కోసం రాష్ట్రంలో తలపెట్టిన సౌరవిద్యుత్ ప్రాజెక్టుల్లో భాగంగా 6,400 మెగావాట్లకు చేపట్టిన టెండర్ల ప్రక్రియ బుధవారం ముగిసింది. అత్యధిక సౌరపార్కులు అదానీ సంస్థకు దక్కాయి. అయితే.. ఇటీవల రాజస్థాన్‌లో ఇవే తరహా టెండర్లలో ఎన్‌టీపీసీ యూనిట్‌కు రూ.2 వంతున బిడ్ దక్కించుకుంటే మన రాష్ట్రంలో సంస్థలన్నీ రూ.2.47-2.58 మధ్య కోట్ చేశాయి. అంటే యూనిట్‌కు 50 పైసలు అదనంగా 30 ఏళ్లపాటు గుత్తేదారు సంస్థలకు చెల్లించాలి. ప్రైస్‌బిడ్లను అధికారులు బుధవారం తెరిచి, ఎల్1 సంస్థను గుర్తించాక రివర్స్ టెండరింగ్‌ను నిర్వహించారు. ఇందులో కనిష్ఠంగా యూనిట్‌కు రూ.2.47, గరిష్ఠంగా రూ.2.58 ధరను పేర్కొన్నారు. ఎన్‌టీపీసీ రాజస్థాన్‌లో యూనిట్‌కు 30 పైసలను రివర్స్ టెండరింగ్‌లో తగ్గిస్తే.. ఇక్కడ రెండు పైసలే తగ్గించింది.
ముగిసిన టెండర్ల ప్రక్రియ
బుధవారం తెరిచిన ప్రైస్‌బిడ్లలో అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ హోల్డింగ్ ట్వల్వ్ లిమిటెడ్ అత్యధికంగా 3 వేల మెగావాట్లను దక్కించుకుంది. కడప జిల్లాకు చెందిన షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ 2,200, ఎన్‌టీపీసీ 600, హెచ్‌ఈఎస్ ఇన్‌ఫ్రా ప్రై. లిమిటెడ్, టోరెంటో పవర్ లిమిటెడ్ సంస్థలు తలో 300 మెగావాట్ల ప్రాజెక్టులను దక్కించుకున్నాయి. బిడ్లు దాఖలుచేసిన వారందరికీ ప్రాజెక్టులు దక్కాయి. కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ సాంకేతిక బిడ్లను పరిశీలించి బుధవారం ఉదయం నివేదిక అందించింది. టెండర్ల ప్రక్రియపై కోర్టు కేసు ఉండటంతో, ప్రైస్ బిడ్ ఆధారంగా గుత్తేదారు సంస్థలను ఎంపిక చేసినా కోర్టు ఆదేశాల మేరకు వ్యవహరించనున్నట్లు రాష్ట్ర గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీజీఈఎల్) అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: