ఈనెల 25లోగా వేరుశనగ పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు... రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశామని వివరించారు. మార్కెట్ స్థిరీకరణ నిధి గురించి ప్రతిపక్ష పార్టీ చేస్తున్న ఆరోపణలపై మంత్రులు కన్నబాబు, మోపిదేవి వివరణ ఇచ్చారు. రూ.3వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. సుబాబుల్ రైతులకూ ఆ నిధి నుంచే నగదు చెల్లించామని తెలిపారు.
డిసెంబరు 15 వరకు అవకాశం...
రైతు భరోసా కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రారంభించి అమలు చేస్తున్నామని మంత్రి కన్నబాబు అన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు నిర్ణయించామని తెలిపారు. నమోదు చేసుకోని రైతులకు డిసెంబరు 15 వరకు అవకాశం ఇచ్చామని చెప్పారు. సామాజిక తనిఖీ ద్వారా అర్హుల జాబితాను వెల్లడిస్తామని... తుది వివరాలు గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తామని స్పష్టం చేశారు. అర్హులైన రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగవద్దని సీఎం ఆదేశించినట్లు తెలిపారు.
ఉల్లిధరలపై చర్యలు...
ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ చెప్పారు. రైతు బజార్లలో కిలో ఉల్లిని రూ.25 కే విక్రయిస్తున్నామని వివరించారు. రైతులకు నష్టం వాటిల్లకుండా స్థిరీకరణ నిధి నుంచి సాయం అందజేస్తున్నామని తెలిపారు.
ఇదీ చదవండి: