మంత్రి వెల్లంపల్లిపై జాతీయ మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెదేపా ఎమ్మెల్సీలు తెలిపారు. పంచాయితీరాజ్ బిల్లుపై జరుగుతున్న చర్చలో మంత్రి వెల్లంపల్లి తనకు సంబంధం లేని అంశంలో కలగజేసుకొని ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌కు ఉన్న అంగవైకల్యాన్ని హేలన చేయడం సరికాదన్నారు. దేవాదాయశాఖ బాధ్యతులు నిర్వర్తిస్తూ... సంస్కార హీనంగా మంత్రి మాట్లాడారని దుయ్యబట్టారు. రాజేంద్రప్రసాద్‌ను హేలన చేసినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తమ శాఖకు సంబంధం లేని అంశాల్లో మంత్రులు అనవసర జోక్యం చేసుకుంటున్నారని ఎమ్మెల్సీలు ధ్వజమెత్తారు. చంద్రబాబును అవమానించేందుకు, జగన్ భజన చేసేందుకు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు జరుపుతున్నారని ఆక్షేపించారు. గిరిజన సమస్యలు అనేకం ఉన్న కనీసం వారి బాధలు వినలేని పరిస్థితుల్లో మంత్రులు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయితీరాజ్ బిల్లుపై తాము సవరణలు ప్రతిపాదించినా.. ఓటింగ్ పెట్టకుండా గందరగోళం మధ్య ఆ బిల్లుకు ఛైర్మన్ ఆమోదం తెలిపారన్న ఎమ్మెల్సీలు.. దీనిపై వివరణ కోరతామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండీ... 350వ రోజు నిరసనలు... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు