ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఆయన భార్య ఐఆర్‌ఎస్ అధికారిణి టి.హెచ్.విజయలక్ష్మిలపై సీబీఐ విచారణ కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు గతేడాది ఫిబ్రవరి 11న ఇచ్చిన తీర్పును పక్కనపెట్టింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే సమాచారం మేరకు సీబీఐ 2017 సెప్టెంబరు 20న టి.హెచ్.విజయలక్ష్మి, ఆదిమూలపు సురేష్‌లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. కేసును సవాలు చేస్తూ సురేష్ దంపతులు 2018 మార్చి 5న తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ బి.వి.నాగరత్నలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత గతనెల 22వ తేదీన వాయిదా వేసిన తీర్పును ధర్మాసనం శుక్రవారం వెలువరించింది. 64 పేజీల తీర్పులో తెలంగాణ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
విచారణతోనే తేలుతుంది
సీబీఐ విచారణ కొనసాగించడానికి గల కారణాలను తీర్పులో సుప్రీంకోర్టు సవివరంగా పేర్కొంది. తీర్పు ప్రతి ఆధారంగా... ‘ప్రతివాది చూపిన ఇంటి విలువ సీపీడబ్ల్యూడీ నివేదిక ప్రకారం ఎక్కువగా ఉంది. బెంగళూరులో ఆస్తి అమ్మకం ద్వారా ఆదాయం సమకూరిందని తెలిపారు. కానీ ఆ విక్రయమే వివాదాస్పదమైందని సీబీఐ పేర్కొంది. ఆ విక్రయ పత్రాల వాస్తవికత దర్యాప్తుతోనే తేలుతుంది. ఛార్టర్డ్ అకౌంటెంట్ల నుంచి ప్రయోజనాలు పొందిన ఎనిమిది మంది అధికారుల్లో విజయలక్ష్మి ఒకరని సీబీఐ పేర్కొంది. ఆమెకు చెందిన సికింద్రాబాద్‌లోని నివాసంపై 2016 జూన్ 27న, హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నివాసంపై 2016 జులై 8న సీబీఐ చేసిన సోదాల్లో స్వాధీనం చేసుకున్న పత్రాలు మరో కేసువని ప్రతివాది పేర్కొన్నా, అవి ప్రస్తుత ఎఫ్‌ఐఆర్‌ను ప్రభావితం చేయవు.’
చట్ట ప్రాథమిక సూత్రాలకు విరుద్ధం..
‘ప్రస్తుత కేసులో సీబీఐ ప్రతివాదుల ఆదాయ మూలాన్ని, ఆస్తుల సంపాదనను సవాలు చేసింది. ఎఫ్‌ఐఆర్‌లోని అంశాలు విచారణకు అర్హమైనవేనా అని న్యాయస్థానం తేల్చాలి. ప్రతివాదులు సమర్పించిన పత్రాల ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయడం చట్ట ప్రాథమిక సూత్రాలకు విరుద్ధం. ప్రతివాదులను దోష విముక్తులను చేసేందుకు హైకోర్టు తన పరిధిని దాటి విచారణ నిర్వహించే ప్రయత్నం చేసింది. ఇప్పటికే 140 మంది సాక్షులను విచారించినట్లు, 500 పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ న్యాయవాది తెలిపారు. విచారణ రెండు మూడు నెలల్లో ముగిసే దశలో ఉంది. అదే సమయంలో వివరణ ఇచ్చేందుకు ప్రతివాదులను పిలుస్తామని వారు హామీ ఇచ్చారు. ఎఫ్‌ఐఆర్‌లో పలు లొసుగులు ఉన్నట్లు ప్రతివాదులు చెబుతున్నారు. ఈ దశలో దానిపై అభిప్రాయాలు వ్యక్తం చేస్తే విచారణలో సాక్ష్యాధారాలకు అడ్డంకిగా మారుతుంది. తెలంగాణ హైకోర్టు చేసిన పొరపాటు అదే. మేం దానిని పునరావృతం చేయదల్చుకోలేదు. మొత్తం ఇంటి విలువనే లెక్కించిన తర్వాత కూడా లిఫ్ట్ విలువను వేరుగా చూపడాన్ని ప్రతివాదులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న పెద్ద లోపంగా చెబుతున్నారు. అలా చూసినా దాని విలువ రూ.పది లక్షలే. దాని ఆధారంగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ప్రతివాదులను పక్కకు తప్పించలేం. అందుకే ఈ దశలో మేం ప్రతివాదులపై ఉన్న ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయం. సీబీఐ దర్యాప్తును కొనసాగించవచ్చు.’
ఈ దశలో స్పీకర్ అనుమతి అవసరమనుకోం
ఆంధ్రప్రదేశ్ (2018, నవంబరు 8) అనుమతి నిరాకరించినందున సీబీఐ కేసు నమోదు చేయగలదా అని ప్రతివాదులు వాదించారు. కానీ ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ చెన్నైలో నమోదైందని, సీబీఐకి తమిళనాడు రాష్ట్ర అనుమతి ఉందని సీబీఐ తెలిపింది. తొలి ప్రతివాది కేంద్రప్రభుత్వ ఉద్యోగి. అదే సమయంలో తెలంగాణ హైకోర్టు పరిధి, స్పీకర్ అనుమతి లేకుండా రెండో ప్రతివాదిపై (సురేష్ ఎమ్మెల్యేగా ఉండడం వల్ల) ఎఫ్‌ఐఆర్ నమోదుపై వాదన లేవనెత్తారు. కానీ ఈ దశలో మేం అది (స్పీకర్ అనుమతి) అవసరం అనుకోవడం లేదు. ఆ విషయాలపై ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేయకుండా వదిలేస్తున్నాం. తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి ఎఫ్‌ఐఆర్‌ను రద్దుచేస్తూ ఇచ్చిన తీర్పును పక్కన పెడుతున్నాం. ఇప్పటికే నమోదుచేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా సీబీఐ కేసు దర్యాప్తును కొనసాగించవచ్చు’ అని సుప్రీం ధర్మాసనం తీర్పులో పేర్కొంది.
ఇదీ చదవండి: CM Jagan Letter to PM Modi: 'విద్యుత్ సంక్షోభం తీర్చేందుకు జోక్యం చేసుకోండి'