తెలంగాణలో సంచలనం సృష్టించిన ఆరేళ్ల బాలిక అత్యాచారం, హత్య ఘటనలో నిందితుడు రాజు వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ రైల్వే పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజు పశ్చాత్తాపంతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని తెలంగాణ గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాఠోడ్(Minister Satyavathi rathod) అభిప్రాయపడ్డారు.
రాజు మృతితో చిన్నారి ఆత్మకు శాంతి చేకూరుతుందని సత్యవతి(Minister Satyavathi rathod) అన్నారు. గురువారం ఉదయం బాలిక కుటుంబాన్ని పరామర్శించినట్లు తెలిపారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
"ఆరేళ్ల బాలికపై అత్యంత పాశవికంగా అఘాయిత్యానికి పాల్పడిన రాజు చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి పాపం రైలు పట్టాలపై పండింది. పశ్చాత్తాపంతోనే అతడు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడు. రాజు కోసం రాష్ట్రమంతా పోస్టర్లు, ఫొటోలు అతికించాం. ఎలాగైనా పట్టుబడతానని గ్రహించి.. బలవన్మరణం చెందాడేమో. అతడి వద్ద మొబైల్ ఫోన్ లేకపోవడం వల్ల పట్టుకోవడం కాస్త ఆలస్యమయింది. చివరకి ఆ చిన్నారికి న్యాయం జరిగింది. ఆమె కుటుంబానికి మేం ఎప్పుడూ అండగా ఉంటాం."
- సత్యవతి రాఠోడ్, రాష్ట్ర గిరిజన, తెలంగాణ స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి
ఇదీ చదవండి:
Saidabad Incident: నా బిడ్డది ఆత్మహత్య కాదు.. చంపేశారు: రాజు తల్లి