భువనేశ్వరిని ఎవరూ ఏమీ అనలేదని మంత్రి పేర్ని నాని అన్నారు. శాసనసభలో చంద్రబాబు సతీమణి ప్రస్తావనే రాలేదని స్పష్టం చేశారు. ఈ అంశంపై పురందేశ్వరి కూడా ట్వీట్ చేశారు.. ఆమెకు ఇదే చెబుతున్నామన్నారు. నిజంగానే రాష్ట్ర చరిత్రలో నిన్న ఒక బ్లాక్ డే నే అన్న పేర్నినాని.., 40 ఏళ్ల రాజకీయ నాయకుడు చంద్రబాబు కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగి చరిత్రను హీనం చేశారని ఆక్షేపించారు(minister perni nani on chandrababu news).
బాలకృష్ణ అమాయక చక్రవర్తి..
బాలకృష్ణ ఒక అమాయక చక్రవర్తి.. ఆయన బావ ఏమి చెబితే అదే నమ్మేస్తున్నారని పేర్ని నాని వ్యాఖ్యానించారు( perni nani react on comments of nandamuri balakrishna news). చంద్రబాబు చెప్పుడు మాటలను విని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు స్పందించారన్నారు. తోబుట్టువు లాంటి వ్యక్తిని ఎవరూ ఏమీ అనలేదని పదేపదే చెబుతున్నామని తెలిపారు. దేవాలయం లాంటి శాసనసభలో బూతుల సంస్కృతిని ప్రవేశపెట్టిందే చంద్రబాబేనని ఆయన ఆరోపించారు. చంద్రబాబు తన అనుభవాన్ని రంగరించి మెలో డ్రామా సృష్టించారని ఆరోపించారు. చంద్రబాబు కుటుంబ సభ్యులను, ఆయన సతీమణి పేరును శాసనసభ లో ఎవరు ఉచ్చరించలేదని స్పష్టం చేశారు. రాజకీయాలను రాజకీయలతోనే ఎదుర్కోవాలన్న ఆయన.., కుటుంబ మర్యాదను పక్కన పెట్టి చంద్రబాబు ఈ డ్రామా చేశారని దుయ్యబట్టారు.
ఆ ఫోన్ రికార్డును బయట పెట్టండి..
అసెంబ్లీలో ఫోన్లతో రికార్డు చేయకూడదని.. కానీ తెదేపా సభ్యులు రికార్డు చేసిన వీడియోను అందరికి పంపారన్నారు. చంద్రబాబు సతీమణిని ఎవరైనా ఏమైనా అని ఉంటే ఆ ఫోన్ రికార్డును బయట పెట్టాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. అసలు చంద్రబాబు సతీమణి ప్రస్తవన శాసనసభలో రాలేదని తెలిపారు. ఆమె పేరును శాసనసభలో ప్రస్తావించినట్టుగా చంద్రబాబు చిత్రీకరణ చేస్తున్నారని విమర్శించారు. అనని మాటలను ఇద్దరు శాసన సభ్యులకు ఆపాదించటం రాజకీయంగా దుర్మార్గపు ప్రక్రియగా పేర్నొన్నారు. నటులు బాలకృష్ణ ఆయన తోబుట్టువులు కూడా ఈ ఆరోపణలు చేయడం శోచనీయమన్నారు. ఎన్టీఆర్ గురించి వారికి చెడుగా నమ్మించగలిగిన చంద్రబాబు.. ఈ అంశంలో కూడా ఇలాగే చేస్తున్నారని పేర్నినాని ఆరోపించారు. సాగుచట్టాలను వెనక్కు తీసుకునేలా(Farm laws repealed news) చేసిన రైతుల విజయాన్ని సంఘీభావంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ చేస్తోందని ఆయన తెలిపారు.
అవినాష్‌ని ఎందుకు లోపల వేయలేదు?
‘సీఎం జగన్ సభలో లేకపోయినా చంద్రబాబు పనిగట్టుకుని మీ బాబాయి హత్య, మీ తల్లి, చెల్లి గురించి చర్చిద్దామని ప్రస్తావించారు. వివేకా హత్య జరిగినప్పుడు చంద్రబాబే ముఖ్యమంత్రి కదా? హత్యతో ఎంపీ అవినాష్‌రెడ్డికి సంబంధం ఉంటే అప్పుడే ఎందుకు లోపల వేయలేదు?’అని మంత్రి ప్రశ్నించారు.
ఆమెను కించపర్చలేదు: విశ్వరూప్, వేణుగోపాలకృష్ణ
శాసనసభలో చంద్రబాబు సతీమణిని తమ సభ్యులెవరూ కించపర్చలేదని మంత్రులు పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. కాకినాడలో శనివారం వారు విలేకర్లతో మాట్లాడారు. విశ్వరూప్ మాట్లాడుతూ సభలో జరిగిన ఘటన ఒకటైతే, చంద్రబాబు బయట చెప్పింది వేరన్నారు. మరోమంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ అసెంబ్లీలో జరిగిన ఘటనను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. స్థానికసంస్థల ఎన్నికల్లో పరాజయం, కుప్పంలో కూలిపోవడంతో చంద్రబాబు నిస్పృహలోకి వెళ్లారని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ అధికారం కోసం చంద్రబాబు ఏదైనా చేస్తారన్నారు.
బాలకృష్ణకు వాస్తవాలు తెలియకపోవచ్చు: కన్నబాబు
చంద్రబాబు ఆయన భార్య విషయంలో తమ సభ్యులు తప్పుగా మాట్లాడినట్లు కన్నీరు పెట్టడం ఆశ్చర్యం కలిగించిందని మంత్రి కన్నబాబు అన్నారు. కాకినాడలో ఎంపీ వంగా గీతతో కలిసి శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎమ్మెల్యే బాలకృష్ణ అసెంబ్లీకి రాలేదని, ఆయనకు వాస్తవాలు తెలిసి ఉండకపోవచ్చునన్నారు. అసెంబ్లీ ప్రొసీడింగ్స్ పరిశీలిస్తే అసలు విషయాలు తెలుస్తాయన్నారు. సీఎం జగన్‌కు మహిళలంటే గౌరవమని, అన్ని రంగాల్లో వారికి ప్రాధాన్యమిచ్చారని కాకినాడ ఎంపీ వంగా గీత అన్నారు. అసెంబ్లీలో అపవాదు వేస్తే చంద్రబాబు అక్కడే నిలబెట్టి తేల్చుకోవాలని, అలా ఎవరైనా అని ఉంటే ముఖ్యమంత్రి అక్కడే వారిని శిక్షించేవారన్నారు.
ఇదీ చదవండి:
BALAKRISHNA FIRE ON YCP : 'విర్రవీగి మాట్లాడేవారు జాగ్రత్త.. నోరు అదుపులో పెట్టుకోవాలి'