హైకోర్టు ఆదేశాలు, కేంద్ర నిబంధనల ప్రకారమే.. సరస్వతి పవర్ సంస్థకు లీజు పెంచినట్లు రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. లీజు పెంపు అనేది చాలా సాధారణ విషయమని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై ప్రతిపక్షాల ఆరోపణలు అర్థరహితమన్న ఆయన.. తెదేపా హయాంలో 30 గనుల లీజు గడువు పెంచినట్లు గుర్తు చేశారు. 2016 నుంచి 2019 వరకు కొన్ని గనులు లీజుకు ఇచ్చారన్న ఆయన.. పరిశ్రమలకు గనుల లీజులు ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు.
తప్పుదోవ పట్టించారు
ఎస్ఈసీ నిమ్మగడ్డ వ్యవహారంలో కోర్టు వ్యాఖ్యలను కొందరు తప్పుదోవ పట్టించారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. కరోనా సమయంలో బ్లీచింగ్ కొనుగోళ్లపైనా ఆరోపణలు చేశారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. రూ.5.75 కోట్లకు కొనుగోలు చేస్తే.. రూ.5.25 లక్షలే చెల్లించినట్లు వెల్లడించారు. ఒకచోట సిబ్బందిపై చర్యలు కూడా తీసుకున్నామని గుర్తు చేశారు.
ఎవరినీ బలవంతంగా చేర్చుకోం..
తాము ఎవరినీ తమ పార్టీలో బలవంతంగా చేర్చుకోమని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు కొన్ని పార్టీల నుంచి వచ్చి చేరడం సహజమని అన్నారు. ఎమ్మెల్యేలను చేర్చుకుంటే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా పోతుందని సీఎం జగన్కు చెప్పామని.. అలాంటివి వద్దని ముఖ్యమంత్రి వారించారని పెద్దిరెడ్డి తెలిపారు. అలా చేస్తే మనకు, చంద్రబాబుకు తేడా ఏంటని సీఎం వ్యాఖ్యానించినట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి.. వైకాపా గూటికి మాజీ మంత్రి శిద్దా రాఘవరావు